
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్‌తోపాటు అన్ని విభాగాలను పరిశీలించి, వైద్యులతో మాట్లాడారు. ఆస్పత్రిలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సదరం క్యాంప్ కు సిబ్బంది రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతీరోజు ఓపీ ఎంత మంది వస్తున్నారని అడిగారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం దామరగిద్ద మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ చూసి, ఇప్పటివరకు ఎన్ని బస్తాల యూరియా విక్రయించారో తప్పనిసరిగా రాయాలని చెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
వీపనగండ్ల ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
వీపనగండ్ల, వెలుగు: వీపనగండ్ల ప్రభుత్వ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో శ్రీనివాసులు మంగళవారం తనిఖీ చేశారు. వైద్య సేవలు, సదుపాయాలపై పేషెంట్లతో మాట్లాడి తెలుసుకున్నారు. నిజాయితీతో పని చేస్తే ఉద్యోగ విరమణ అనంతరం కూడా గౌరవం లభిస్తుందని వైద్య సిబ్బందికి సూచించారు. సీహెచ్‌వో దయామణి ఉద్యోగ విరమణ పొందగా సన్మానించారు. దయామణి క్రమశిక్షణతో సేవలందించారని కొనియాడారు. మండల వైద్యాధికారి వంశీకృష్ణ, డాక్టర్రాజశేఖర్ తదితరులున్నారు.