వలస సహాయ కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

వలస సహాయ కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

కోస్గి, వెలుగు : కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసిన వలస సహాయ కేంద్రం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కోస్గి తహసీల్దార్ ఆఫీస్​లోని నమూనా ఇందిరమ్మ గృహంలో వలస సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సంబంధించిన మొబైల్ వ్యాన్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, వాసన్ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 వలస కుటుంబాల మహిళలు, యువతకు వ్యవసాయ, వ్యవసాయేతర జీవనోపాధులపై శిక్షణ ఇస్తామని చెప్పారు. వలసలపై అవగాహన కల్పిస్తామని,  సలహాల కోసం సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చన్నారు. మొబైల్ వ్యాన్ ద్వారా మారుమూల గ్రామాలకు సమాచారం, అవగాహన చేరుతుందని చెప్పారు. కేంద్ర సేవలతో పాటు ప్రవాసీ కౌన్సెలింగ్ సెంటర్ కు అనుబంధంగా టోల్ ఫ్రీ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ 1800-599-1393 అందుబాటులో ఉందన్నారు. 

ఈ సేవలు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. గత ఫిబ్రవరిలో వలసల పరిస్థితిని తెలుసుకునేందుకు జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన సంస్థ సభ్యులు నారాయణపేటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నారాయణపేట జిల్లాను వలసలు లేని జిల్లాగా మారాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, డీఆర్డీఏ మొగులప్ప, తహసీల్దార్ బక్క శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఐవోఎం రాష్ట్ర సమన్వయకర్త జలజ, సహాయ సమన్వయకర్త మార్ష్ ఆశీర్, సంస్థ ఫీల్డ్ ఫెసిలిటేటర్లు పాల్గొన్నారు.