
హసన్‌పర్తి/ ఎల్కతుర్తి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్అన్నారు. మంగళవారం కలెక్టర్ పైలట్ గ్రామాలైన హసన్‌పర్తి మండలం పెంబర్తి, ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్లోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి, నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, పనులను నిలిపివేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, వీరనారాయణపూర్‌లో లబ్ధిదారులు ఇండ్ల వద్ద లేకపోవడంతో పర్యటన విషయం ఒకరోజు ముందుగానే చెప్పినా లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని కార్యదర్శి శ్రీనాథ్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే గ్రామంలో పనులు నత్తనడకన సాగడమేంటని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్‌ను ప్రశ్నించారు. వెంటనే పనులు స్పీడప్ చేయాలని సూచించారు. అనంతరం ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులు, ఫార్మసీ, రిజిస్టర్లను పరిశీలించారు. ఆశ వర్కర్ల, ఏఎన్ఎంలతో సమావేశమై ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెలివరీల సంఖ్య తగ్గడమేంటని డాక్టర్ శ్రీనాథ్‌ను ప్రశ్నించారు. సిబ్బందికి సరైన గైడ్లైన్స్ ఇవ్వాలని సూచించారు.