విద్యార్థులు అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

విద్యార్థులు అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: ఆకాశమే హద్దుగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పిన డాక్టర్ అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆచరణలోకి తీసుకురావాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థులకు సూచించారు. కలెక్టరేట్​లో మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధులు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం-2025 లో ఆయన పాల్గొని, మాట్లాడారు. జిల్లాలో మహిళా సమస్యలను పరిష్కరించేందుకు 'బాలిక చైతన్యం' కార్యక్రమం ప్రారంభించి, పోలీస్, వైద్య, విద్యాశాఖలతో కలిసి ప్రతి పాఠశాలలో నెలకు నాలుగు వారాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

విద్య ద్వారానే లింగ వివక్షత, భ్రూణహత్యల వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. గతేడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లో 5200 మంది చేరగా, ఈ ఏడాది 10,000 మందికి పైగా చేరడం శుభపరిణామమని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్ కె.సీతారామరావు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థులు దారి తప్పరాదన్నారు. మహిళలు, విద్యార్థినిల రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని, ఏమైనా సమస్యలుంటే టోల్​ఫ్రీ నంబర్ 1098 కు కాల్ చేయాలని సూచించారు. 

పోటీ పరీక్షలకు బోధనపై ప్రత్యేక శ్రద్ధ

చదువులో వెనుకబడిన విద్యార్థులపై అదనపు తరగతులు నిర్వహించి, ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ ఇవ్వాలని కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ అన్నారు. ఈ నెల 24 నుంచి జరగనున్న సమ్మేటివ్ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సరిగ్గా సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్​ హెచ్​ఎంలతో కలెక్టర్​ రివ్యూ చేశారు. నవంబర్ 1-15 వరకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు అన్ని పాఠశాలను తనిఖీ చేసి, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, పాఠశాలల్లో బోధనా సామర్థ్యాన్ని పెంచాలని, సరైన బోధన నిర్వహించని ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.