
చివ్వె౦ల, వెలుగు: గురుకులాలలో చదివిన విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కోహన్స్ స్వచ్ఛంద సంస్థ రూ.12 లక్షల విలువ చేసే 276 డ్యూయల్ డెస్క్ లను చివ్వె౦ల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలకు బహూకరించగా ఆ కార్యక్రమానికి కలెక్టర్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కలెక్టర్మాట్లాడుతూ.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారని అందరికన్నా చురుకుగా బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు. భవిష్యత్లో వీరు ఉన్నత స్థానంలో నిలుస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
చివ్వె౦ల రెసిడెన్షియల్ స్కూల్ కి గతేడాది చిన్నచిన్న రిపేర్లు చేయించామని, ప్రస్తుతం టాయిలెట్స్ పైప్లైన్నిర్మాణం, ఇతర రిపేర్లకు ప్రభుత్వం రూ.కోటి 16 లక్షలు మంజూరు చేసిందన్నారు. టెక్నికల్ అనుమతి వచ్చిన వెంటనే పనులను ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని ప్రిన్సిపాల్ ను, ఆర్సీవోలను ఆదేశించారు. పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ చివ్వె౦ల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను రాష్ట్ర స్థాయిలో మోడల్ గా నిలపాలన్నదే తమ ధ్యేయమన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి సూర్యాపేట జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. పాఠశాలలో సమస్యలను పరిష్కరించేందుకు సహకారం అందిస్తానని తెలిపారు. అడిగిన వెంటనే టాయిలెట్ అవుట్ లెట్ పైపులైను కు సుధాకర్ పీవీసీ సంస్థ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషమన్నారు. త్వరలోనే పాఠశాలలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు కానుందని, స్ప్రెడ్ ఇండియా సహకారంతో స్పోకెన్ ఇంగ్లీష్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
మట్టి గణపతులను పూజించాలి
సూర్యాపేట కలెక్టరేట్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ప్రచార పోస్టర్ను విడుదల చేశారు.