
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, కలెక్టరేట్, వెలుగు: పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కొన్ని శాఖల్లో ఎక్కువ రోజుల నుంచి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, అలాంటి శాఖల అధికారులు వారం రోజుల్లో పెండింగ్ ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజావాణి ఫిర్యాదులతో పాటు, ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇతర ఫిర్యాదులపై దృష్టి పెట్టి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులు సమస్యల పరిష్కారంతో పాటు, ప్రభుత్వ పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని, ప్రతిరోజు తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సోమవారం భూములకు సంబంధించి 38 ఫిర్యాదులు, ఎంపీడీవోలకు 11, జిల్లా, ఇతర అధికారులకు 47, మొత్తం 96 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటన్నింటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ రాంబాబు, డీఆర్డీవో అప్పారావు, డీఎఫ్వో సతీశ్ కుమార్, డీఏవో శ్రీధర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 59 ఫిర్యాదులు
యాదాద్రి: యాదాద్రి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 59 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వీటిలో భూ సంబంధిత సమస్యలపై 44 ఫిర్యాదులు రాగా జిల్లా పంచాయతీ శాఖపై 7, మిగిలిన శాఖలపై 8 వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, సీఈవో శోభారాణి, డీఆర్డీవో నాగిరెడ్డి, డీఆర్వో జయమ్మ ఉన్నారు.
ప్రజావాణి కి 85 దరఖాస్తులు
నల్గొండ అర్బన్ : ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను అధికారులతో కలిసి స్వీకరించారు. జిల్లా అధికారులకు 35, రెవెన్యూ శాఖకు 50 మొత్తం 85 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కారించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ అమిత్ నారాయణ, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, ఇన్చార్జి డీఆర్వో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.