
సూర్యాపేట, వెలుగు : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, ఎంపీడీవో లు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీవోలు, ఏపీవోలు, ఫారెస్ట్ ఆఫీసర్లతో హరితహారంపై వెబ్ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిశాఖకు నిర్దేశించిన హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గ్రౌండింగ్ పూర్తి చేసే విధంగా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు.
సమాజంలో టీచర్ల పాత్ర కీలకం..
సమాజ నిర్మాణంలో టీచర్లు కీలకపాత్ర పోషిస్తారని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యయులదేనన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 9,10 తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని చెప్పారు. 6,7,8 తరగతుల విద్యార్థులకు ‘ప్రగతి గ్రూప్స్’ పేరిట అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.