అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
  • ​​​​​కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, గరిడేపల్లి, వెలుగు : విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం గరిడేపల్లి మండలంలో  ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్​వాడీ కేంద్రాలు, సహకార సంఘాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. అంగన్​వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. 

జిల్లాలో ఎక్కడైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండలంలోని పొనుగోడు గ్రామంలో సహకార సంఘం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. స్థానిక ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి యూరియా నిల్వలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొనుగోడు లోని జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాల, గరిడేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు.

 ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. గరిడేపల్లిలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరెట్​లో  భేటీ బచావో.. భేటీ పడావో పథకం, కిశోర బాలికలకు విద్య, మానసిక స్థితి,పోషణపై అధికారులు, టీచర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సీజనల్​ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.