
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్లు, ఎస్పీలు
- పోలీసు అమరవీరులకు ఘన నివాళి
సూర్యాపేట, వెలుగు: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వారి సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరులకు నివాళి ఘటించి పరేడ్ నిర్వహించారు. 2015లో సూర్యాపేట జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో అమరులైన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్వర్ కుటుంబాలకు 200 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి వారికి పట్టా అందించారు.
జిల్లాలో అమరులైన హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్, కానిస్టేబుల్ లింగయ్య హోంగార్డు మహేశ్వర్ పిల్లల చదువుల ఖర్చులకు కలెక్టర్ నిధుల నుంచి ఆర్థిక సాయం అందించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ.. సమాజంలో రోజురోజుకు పోలీసుల బాధ్యత పెరుగుతుందన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని అన్నారు.
నేటి ప్రశాంత సమాజం పోలీసు అమరవీరుల ప్రాణాల త్యాగ ఫలితమేనని, శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని ఎస్పీ కె. నరసింహ అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు, రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నర్సింహ చారి, రవి, ఏవో మంజు భార్గవి, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, సీఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి
నల్గొండ అర్బన్, వెలుగు : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులతో అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలతో నివాళలర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు పరామర్శించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజారక్షణకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో ఎంతో మంది అమరులవుతున్నారని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 అమరవీరుల స్మారక దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్లలో మంగళవారం నుంచి ఈ నెల 31వ తేది వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్నెపర్తి లోని 12 వ బెటాలియన్ లో కమాండెంట్ కె. వీరయ్య పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎఎస్పీ రమేశ్, ఎస్బీ డీఎస్పీలు మల్లారెడ్డి, శివరాం రెడ్డి, శ్రీనివాసులు, సీఐలు రాఘవ రావు, రాము, మహా లక్ష్మయ్య, రాజశేఖర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, శ్రీను నాయక్, సురేష్, చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, సూరప్ప నాయుడు, నరసింహ ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.