
దేవరకొండ, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యులను ఆదేశించారు. బుధవారం దేవరకొండ ఏరియా ఆసుపత్రిని స్థానిక ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఆస్పత్రికి వస్తున్న రోగుల ఓపీ రికార్డు, ఏఎన్ సీ, శానిటేషన్ అంశాలను పరిశీలించారు.
ఆసుపత్రిలో వైద్యం అందుతున్న తీరును సూపరింటెండెంట్ రవి ప్రకాశ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్న పేదలకు నాణ్యమైన వైద్యం, మెడిసిన్ అందజేయాలని వైద్యులను ఆదేశించారు.
అనంతరం దేవరకొండ పట్టణంలోని డిండి రోడ్లో గల నూతన ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. చందంపేట మండల పరిధిలోని గాగిల్లాపురం గ్రామంలో పూర్తయిన 25 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేసి, గృహప్రవేశాలు జరిగేలా చూడాలని గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు.
అనంతరం చందంపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో డానియల్ శాఖల అధికారులు తదితరులున్నారు.