నల్గొండ అర్బన్, వెలుగు : విద్యార్థులు మొక్కలు నాటి వాటిని కాపాడాలని, శ్రమదానం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం నల్గొండలోని దేవరకొండ రోడ్ లోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి బాగా చదువుకోవాలని చెప్పారు. అనుకున్నది సాధించాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి పాల్గొన్నారు.
నానో యూరియాను వినియోగించాలి..
జిల్లాలో సాధారణ యూరియాతోపాటు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగించేందుకు రైతులకు అగ్రికల్చర్ సైంటిస్టులు, ఆఫీసర్లు అవగాహన కల్పిస్తున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాలోనూ యూరియాతో సమానమైన నత్రజని ఉంటుందని, పైగా దీని రవాణా, నిల్వ, వినియోగం కూడా సులభంగా ఉండడమే కాకుండా రైతులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. మార్కెట్లో రిటైల్ డీలర్లు , సహకార సంఘాల వద్ద ఈ యూరియా అందుబాటులో ఉందన్నారు. లీటర్ నీటిలో 4 ఎంఎల్ నానో యూరియాను కలిపి స్ప్రే చేయాలని చెప్పారు.
