రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు, జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాట్లు, రక్షణ చర్యలు, కపాస్ కిసాన్ యాప్ నిర్వహణపై- మంగళవారం కలెక్టరేట్​లో జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్​తో కలిసి కలెక్టర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని రైతులు ఈ సీజన్​లో 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 38 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలన్నారు.

 జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని సకాలంలో కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా యాప్ వినియోగంపై వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో  డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, మార్కెటింగ్ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, రవాణా శాఖ అధికారి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా కంప్లీట్ చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా కంప్లీట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వాంకిడి మండలం జైత్ పూర్ లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట హౌజింగ్ పీడీ వేణుగోపాల్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.