పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: రైతులు పత్తి పంటను సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బూర్గుడ శివారులోని ఆర్ఎస్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేస్తోందని తెలిపారు. పత్తిని దళారులు, ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మి నష్టపోవద్దన్నారు.

ప్రతి రైతు కపాస్ కిసాన్ యాప్​ను వినియోగించుకోవాలని, తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. యాప్​పై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సీసీఐ ఆధ్వర్యంలో జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్లు కొనాలి

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్​తో కలిసి జిల్లా పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, రవాణా, తూనికలు కొలతలు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వానాకాలం  సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు, ఏర్పాట్ల నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. జిల్లాలో 44 వేల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

 కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, తూకం యంత్రాలు, ట్యాబ్​లు, టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. కొన్న వెంటనే ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.