
ఆసిఫాబాద్, వెలుగు: గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన గిరిజనులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. దర్తీ అభ జన జాతీయ గ్రామీణ ఉత్కర్ష పథకంలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్లో బ్లాక్ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం గిరిజనుల స్థితిగతులు మార్చేందుకు ఉత్కర్ష అభియాన్ కార్యక్రమం ద్వారా కృషి చేస్తోందన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ రూపొందించేందుకు ఆది కర్మ యోగి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. గిరిజనులకు వైద్య, విద్య, తాగునీరు, ఆరోగ్యం అందేలా గ్రామస్థాయి నుంచి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
డ్రగ్స్ రవాణా అరికట్టేందుకు తనిఖీలు
డ్రగ్స్రవాణాను అరికట్టేందుకు జిల్లాలో విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి డ్రగ్స్నివారణపై నషా ముక్తి భారత్ అభియాన్ సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు.
డ్రగ్స్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు. మారుమూల గ్రామాలు, గుట్టలు, అటవీ ప్రాంతాలలో గంజాయి సాగు చేస్తున్నారని, తనిఖీలు చేపట్టి భూ యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు. వారికి ప్రభుత్వం నుంచి వస్తున్న రాయితీలను రద్దు చేయాలన్నారు. విద్యాలయాలకు 200 మీటర్ల పరిధిలో పాన్ టేలాలు ఉండకూడదన్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
స్టూడెంట్ల హెల్త్ పై దృష్టి పెట్టాలి
ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రం జన్కాపూర్‌లోని గిరిజన బాలుర ఆశ్రమ స్కూల్, వసతి గృహాన్ని సందర్శించి రిజిస్టర్లు, కిచెన్, భోజనం నాణ్యత, విద్యా బోధన విధానం, క్లాస్‌రూమ్‌లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గుణాత్మక విద్య అందించాలన్నారు. వచ్చే నెల నాటికి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో పురోగతి లేకుంటే టీచర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.