సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన గిరిజనులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. దర్తీ అభ జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్, ఆది కర్మయోగి అభియాన్​లో భాగంగా మంగళవారం కలెక్టరేట్​లో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.

 ఆది కర్మయోగి కార్యక్రమాల ద్వారా జిల్లాలోని 12 మండలాల్లోని 102 గ్రామాల్లో ఉన్న గిరిజనులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలు చేరేలా బ్లాక్ స్థాయి (మండల) మాస్టర్ ట్రైనర్లు, గ్రామస్థాయి శిక్షకులకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం 102 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, గ్రామాల్లో పనిచేసే ప్రతి శాఖకు సంబంధించిన సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎరువులను ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు

రైతులకు ఎరువులు, మందులను అధిక ధరలకు అమ్మితే షాపుల యజమానులపై కఠిన చర్యలుతీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్​లోని శ్రీ శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, ఈ-పాస్ యంత్రం, ధరల పట్టిక, స్టాకు నిల్వలను పరిశీలించారు. రైతులు అడిగిన మందులను నిర్ణీత ధరలకు మాత్రమే అమ్మాలని, కచ్చితంగా రసీదు అందజేయాలన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.