
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: చదువులో వెరనుకబడిన పిల్లలపై ఫోకస్ పెట్టి వారు రాణించేలా చొరవ చూపాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం నగరంలోని సారిక టౌన్ షిప్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, పరిసరాలను పరిశీలించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మెనూ ప్రకారం స్టూడెంట్లకు భోజనం అందించాలన్నారు. స్టూడెంట్లతో మాట్లాడి స్కూల్లోని సమస్యల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈవీఎం గోడౌన్ లో కలెక్టర్ తనిఖీలు
కలెక్టరేట్ లో ఉన్న ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. గోడౌన్ సీల్ ను, సీసీ కెమెరాలు, భద్రతను పరిశీలించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆమె వెంట ఎన్నికల డీటీ జాఫర్, సంబంధిత అధికారులు ఉన్నారు.
నూరు శాతం ఉత్తీర్ణత సాదించాలి
ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులంతా నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శనివారం కలెక్టర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈఓలు, కాంప్లెక్ హెడ్ మాస్టర్ లు, 80 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించిన స్కూళ్ల హెచ్ఎంలతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో టెన్త్ విద్యార్థులకు ఇబ్బందులు, పరీక్షలపై భయం వంటివి ఉన్నాయని, వారికి అర్థమయ్యేలా పాఠ్యాంశాలను బోధించాలన్నారు.
ప్రతి స్కూల్లోని టెన్త్ విద్యార్థులు వంద శాతం ఉతీర్ణతను సాధించేలా హెడ్ మాస్టర్లు, టీచర్లు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈవో ప్రవీణ్ కుమార్, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామచంద్రం, సీఎంవో బాలు యాదవ్, ఏఎంఓ శ్రీనివాస్ ఉన్నారు.