నార్మల్​ డెలివరీలు పెంచాలి : కలెక్టర్ వీపీ గౌతమ్

నార్మల్​ డెలివరీలు పెంచాలి : కలెక్టర్ వీపీ గౌతమ్
  •     ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్‌‌ వీపీ గౌతమ్‌‌ వైద్యాధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పరిషత్‌‌ మీటింగ్ హాల్ లో సాధారణ ప్రసవాల పెంపుపై వైద్యాధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజీ డాక్టర్లతో కలెక్టర్‌‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 56 ప్రైవేటు ఆసుపత్రుల్లో 2023లో  10,024 ప్రసవాలు జరిగాయి. అందులో 7,748 (77.29 శాతం) సీ సెక్షన్‌‌ ఆపరేషన్‌‌తో జరగగా, 2315 (23.09శాతం)  మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్​ ఆసుపత్రుల్లో  80 శాతం వరకు సీ సెక్షన్‌‌ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరుగుతున్నట్లు తెలిపారు.

సాధారణ ప్రసవాలు చేపట్టేలా, ప్రభుత్వ యంత్రాంగం తరఫున వారికి సహకరించాలన్నారు.  పసి పిల్లల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రసవించిన తర్వాత మొదటి గంటలోపు అందించే ముర్రె పాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో ఆపరేషన్లు జరగడంతో  36 శాతం పిల్లలకు మాత్రమే ముర్రే పాలు అందుతున్నాయని తెలిపారు. సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉన్నప్పటికీ చిన్న చిన్న కారణాలు చూపుతూ ఆపరేషన్ల వైపు వెళ్లడం సరికాదన్నారు. జిల్లాలో జరిగే ప్రతి సీజేరియన్‌‌ ఆపరేషన్‌‌ కు సంబంధించి సమగ్ర వివరాలు

నివేదిక సమర్పించాలని కోరారు. 12 ఆసుపత్రులలో ఎక్కువగా సిజేరియన్‌‌ కాన్పులు జరగడం గమనించామని, వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆసుపత్రుల యాజమాన్యాలను కలెక్టర్‌‌ ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ సుబ్బారావు, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌ ఎల్‌‌.కిరణ్‌‌, ఆర్‌‌ఎంఓ రాంబాబు,డాక్టర్ బాబు రత్నాకర్‌‌, డాక్టర్ రాధిక, ప్రైవేట్​ ఆసుపత్రుల గైనకాలజిస్టులు పాల్గొన్నారు.