గ్రీవెన్స్ అర్జీలకు టాప్​ ప్రియారిటీ

గ్రీవెన్స్ అర్జీలకు టాప్​ ప్రియారిటీ

ఖమ్మం టౌన్, వెలుగు:  గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌‌‌‌ వీపీ గౌతమ్‌‌‌‌ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఖమ్మం ఆర్టీసీ కాంప్లెక్స్ లో వాటర్ బాటిల్స్ అధిక ధరలకు అమ్ముతున్నట్లు షేక్ మదార్ సాహెబ్ ఫిర్యాదు చేశాడు.  ఎస్సీ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి సర్వే నెంబర్ 955లో 0.20 ఎకరాల భూమిని తాను సాగుచేసుకుంటున్నానని ఆన్​లైన్​లో నమోదు చేయలేదని, ఆ భూమిని తన పేర మార్చాలని మధిర మండలం మాటూరుకు చెందిన గొల్లమందల ముత్తయ్య కోరారు. వైరా మండలం తాటిపూడికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తాను 95శాతం దివ్యాంగుడినని, ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని కోరాడు.  

సర్వే నెం.2/ఇలో తన15 గుంటల భూమిని పొరుగున ఉన్నవారు ఆక్రమించారని, న్యాయం చేయాలని పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన కోటగిరి శ్రీదేవి అనే మహిళ కోరింది. సర్వే నెం.548లోని14.17 గుంటల భూమిని గిరిజనేతరులు ఆక్రమించినట్లు, ఎల్ టీఆర్ భూబదలాయింపు నిషేధ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని సింగరేణి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన బానోతు శంకర్, బానోతు అనిల్ కోరారు. ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెంకు చెందిన అప్పలరాజు అనే వ్యక్తి సర్వే నెం.772లో 2ఎకరాల ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆఫీసర్లను  సమస్యలను సాల్వ్​ చేయాలని ఆదేశించారు. 

గొర్రెల పంపిణీకి కార్యాచరణ...

రెండో విడత గొర్రెల పంపిణీకి కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ అంశంపై ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ మొదటి విడతగా16 వేల మంది గొల్ల, కుర్మలకు గొర్రెల యూనిట్లు ఆందజేశామన్నారు. రెండో విడత కింద మరో16,844 మంది గొల్ల, కుర్మలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉందన్నారు.10,200 మంది లబ్ధిదారుడి వాటా డీడీలు చెల్లించినట్లు, డీడీలు కట్టనివారికి అవగాహన కల్పించి, వెంటనే చెల్లించేలా చూడాలన్నారు.

కొత్తవారికి అవకాశం లేదని, లబ్ధిదారుల్లో చనిపోయిన వారుంటే, వారి వారసులకు యూనిట్లను అందిస్తామన్నారు. గొర్లు రీసైకిల్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలని, ఇన్సూరెన్స్, ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, శిక్షణా ఐపీఎస్ అవినాశ్​ కుమార్, డీఆర్వో శిరీష, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు. అనంతరం దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతిని ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

గిరిజనుల జీవనోపాధికి కృషి చేస్తాం: పీవో

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు జీవనోపాధిని కల్పించేందుకు కృషి చేస్తామని పీవో గౌతమ్ తెలిపారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బారులో ఆయన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దర్బారులో కేవలం జీవనోపాధి, స్వయం ఉపాధికి సంబంధించిన వాటికే ఆర్జీలు పెట్టుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రతీ గిరిజనుడికి అందేలా యూనిట్​ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పీవో ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి వీఓఏల ముట్టడి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వీఓఏల సమస్యలు పరిష్కరించకుంటే బీఆర్ఎస్​కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆ సంఘం లీడర్లు హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వీఓఏలు కలెక్టరేట్​ను ముట్టడించారు. అనంతరం వారు మాట్లాడారు. 36 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. మండుటెండల్లో దీక్షలు చేస్తున్నా సీఎంతోపాటు మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు.

పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్నిచ్చారు. కాగా కలెక్టరేట్​ ముట్టడిని పోలీసులు అడ్డుకోగా నాయకులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. వీఓఏల ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలిపింది. ప్రోగ్రామ్​లో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బ్రహ్మచారి, ఏజే రమేశ్, వీఓఏల సంఘం లీడర్లు జి .శ్రీను, వీరన్న, చంద్రలీల, గోపాల్, రేష్మ, కమల్, గోవిందమ్మ, మీన, సులోచన, సీతారత్నం, రమేశ్​ పాల్గొన్నారు.