నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : వీపీ గౌతమ్​

 నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి  : వీపీ గౌతమ్​
  • అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు హెల్ప్​ డెస్క్​ 

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం లోక్​ సభ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం న్యూ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. 21న ఆదివారం మినహాయించి మిగతా 7 రోజులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.

 నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తామని, మిగతా వెహికల్స్​100 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పారు. న్యూ కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు, రిటర్నింగ్ అధికారి చాంబర్ లో ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. బ్యాలెట్ పేపర్, ఈవీఎంలో ముద్రణకు చిహ్నాలు ఎన్నికల సంఘం నుంచి వస్తాయని చెప్పారు. 

ఫొటోల విషయంలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 26న అదే చాంబర్ లో స్క్రూటిని ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. 29న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉన్నట్లు తెలిపారు. నామినేషన్​ వేసే అభ్యర్థులకు కలెక్టరేట్ లో హెల్ప్​ డెస్క్​ ఏర్పాటు చేసి, లేటెస్ట్ నామినేషన్ పత్రం ప్రింట్, అఫిడవిట్ పత్రాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 

కొత్తగా బ్యాంక్​ ఖాతాలు తెరవాలి.. 

అభ్యర్థులు ఎన్నికల ఖర్చు విషయమై తాజా బ్యాంక్ ఖాతాలు తెరవాలని కలెక్టర్​ సూచించారు.  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 12,500, మిగతా అభ్యర్థులకు రూ. 25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, ఎన్నికల సంఘానికి లైవ్ టెలికాస్ట్ అవుతుందని చెప్పారు. ఈనెల 17న వ్యయ పరిశీలకులు, 25న సాధారణ, పోలీస్ పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 16,26,427 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 

గట్టి బందోబస్తు

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు, ఎస్ఎస్టీ టీమ్​లు ఈ నెల 18 నుంచి పనిచేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇప్పటి వరకు 102 కేసులు నమోదైనట్లు, 96 మద్యం కేసులు ఉన్నట్లు, రూ.కోటిన్నర నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే నిఘాను పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎంఏ గౌస్, జిల్లా ఉపాధికల్పన అధికారి కే. శ్రీరామ్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు పాల్గొన్నారు. 

భద్రత ఏర్పాట్లు పరిశీలన

మీటింగ్ తర్వాత న్యూ కలెక్టరేట్ కార్యాలయ ఎంట్రెన్స్ గేట్ నుంచి రిటర్నింగ్ అధికారి చాంబర్ వరకు చేయాల్సిన భద్రత ఏర్పాట్లను కలెక్టర్​, సీపీ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ఉన్నందున కలెక్టరేట్ కు ఆ సమయంలో విజిటర్లు రావొద్దని సూచించారు.