నాసిరకం విత్తనాలు అమ్మితే చర్యలు : వీపీ గౌతమ్

నాసిరకం విత్తనాలు అమ్మితే చర్యలు : వీపీ గౌతమ్
  • సీడ్స్, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దు
  • డీలర్లు, ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం

ఖమ్మం టౌన్, వెలుగు : రైతులకు నాసిరకం విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు.  శుక్రవారం న్యూ కలెక్టరేట్ లో సీపీ సునీల్ దత్ తో కలిసి వ్యవసాయశాఖ అధికారులు, విత్తన డీలర్లు, విత్తన సరఫరా ఏజెన్సీలు, విత్తన డిస్ట్రిబ్యూటర్ లతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు డీలర్లు, ఫెర్టిలైజర్ షాపు యజమానులు కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయించవద్దని తెలిపారు. రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. 

మార్కెట్ లో నాసిరకం విత్తనాల విక్రయం జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నాసిరకం విత్తనాలను అరికట్టడం కోసం జిల్లాలో పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు రసీదు తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. రసీదులో రైతు పేరు, ఏ విత్తన కంపెనీ తదితర వివరాలు నమోదు చేసి, రైతు నుంచి సంతకం తీసుకోవాలని సూచించారు. 

విత్తనాల స్టాక్ రాగానే బిల్లులను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పంపాలని,  రిజిస్టర్లు మెయింటేయిన్​ చేయాలన్నారు. గతేడాది విత్తనాలు, పురుగు మందులు ఏవైనా నిల్వలు ఉంటే, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేదని, 5.25 లక్షల ప్యాకెట్లు అవసరం ఉండగా, 5.60 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఒక బ్రాండ్ మంచిదని రైతుల్లో ప్రచారం చేయకూడదన్నారు.  లైసెన్స్ సస్పెండ్ అయిన వారు, వేరే వారి పేరుపై లైసెన్స్ తీసుకొని షాపులు నడిపితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో విత్తనాల అమ్మకాలపై నిఘా పెట్టాలన్నారు. కాటన్ బిజీ3 కి వెళ్లొద్దని, ఈ రకాన్ని దేశంలో నిషేధించారని తెలిపారు. 

సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ నాసిరకం విత్తనాల విషయంలో జిల్లాలో గత 10 సంవత్సరాల్లో 50 కేసులు నమోదైనట్లు తెలిపారు. సరియైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్లతో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దని సూచించారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారి సమాచారం తమకు అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా ఉద్యానవన అధికారి వెంకట రమణ, సీడ్స్ కార్పొరేషన్ ఆర్ఎం ఎన్. భిక్షం, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలు, తదితరులు పాల్గొన్నారు. 

తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలి

తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, వర్షాకాలం ముందస్తు చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. తాగునీటి సమస్యపై ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి పరిష్కరించాలని చెప్పారు. తెరచివున్న బావులపై రక్షణ గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల పై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివ కుమార్, ఇర్రిగేషన్ ఎస్ఈ డి.నర్సింగ రావు, జడ్పీ సీఈవో వినోద్, డీపీవో హరికిషన్, అధికారులు 
పాల్గొన్నారు.

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

పోలింగ్​ అధికారులు ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. శుక్రవారం కలెక్టర్, స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సిబ్బందికి చేపట్టిన శిక్షణా కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకొవద్దని చెప్పారు. 

ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం సరఫరా చేసిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్,  ఇండెలిబుల్  ఇంకులు మాత్రమే వినియోగించాలని సూచించారు. జీరో ఎర్రర్ తో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సెక్టార్ అధికారుల వాహనాలు జీపీఎస్ తో సిద్ధం చేయాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, డీఆర్డీఏ సన్యాసయ్య, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.