కండక్టర్​ నుంచి కేఎఫ్​సీ దాకా...

కండక్టర్​ నుంచి  కేఎఫ్​సీ దాకా...

నాన్​వెజ్​ ఇష్టపడేవాళ్ళు.. ముఖ్యంగా చికెన్​ అంటే  లొట్టలేసుకుంటూ తినేవాళ్ళకు కెఎఫ్​సి పేరు వింటేనే నోరూరిపోతుంది. ఎక్కడైనా కెఎఫ్​సి రెస్టారెంట్​ కనిపిస్తే చాలు వెంటనే వెళ్ళి ఓ పట్టు పట్టాలనిపిస్తుంది.  అంత ఫేమస్​ అయిన కెంటకీ ఫ్రైడ్​ చికెన్​ ఫౌండర్​​ కల్నల్​ శాండర్స్​​.   
‘జీవితంలో మంచి స్థాయికి చేరాలంటే కష్టనష్టాలు తప్పవు. ఎదురుదెబ్బలు సహజం. అయినా ప్రయత్నం ఆపకూడదు. చివరికి ఏదో ఒకరోజు విజయం సాధిస్తావు’ అని పెద్దలు చెప్తుంటారు. అలా గెలిచినవాళ్ళకు ఉదాహరణ కల్నల్​​​ శాండర్స్​​. కష్టాల్లో పుట్టి, నష్టాలతో కలిసి బతికి, ఎదురు దెబ్బలు తింటూ ఆఖరికి 62 ఏండ్ల వయసులో జీవితంలో నిలదొక్కుకున్నాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. కల్నల్​ శాండర్స్​​ అసలు పేరు హార్లాండ్​ డేవిడ్​ శాండర్స్​​. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న హెన్రీవిల్లేలో సెప్టెంబర్​ 9, 1890లో పుట్టాడు. తల్లిదండ్రులు విల్బర్​ డేవిడ్​​, మార్గరెట్​ ఆన్​​. హార్లాండ్​​​​​కు తమ్ముడు క్లారెన్స్​, చెల్లెలు కేథరిన్​ ఉన్నారు. ​ 

సవతి తండ్రి పట్టించుకోకపోవడంతో...

హార్లాండ్​కు ఐదేండ్ల వయసులో తండ్రి చనిపోయాడు. దాంతో కుటుంబ బాధ్యత తల్లిపై పడింది. ఆమె దగ్గరలోని టొమాటో ఉత్పత్తుల తయారీ కంపెనీలో పనికి చేరింది. రోజూ ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేది. ఆ టైంలో తమ్ముడు, చెల్లెల్ని హార్లాండ్​ చూసుకోవాల్సి వచ్చేది. అంతేకాదు, వాళ్లకు కావాల్సినవి వండిపెట్టాల్సి వచ్చేది. అందుకోసమే తల్లి దగ్గర వంటలు నేర్చుకున్నాడు. అప్పుడే చికెన్​ తయారీపై హార్లాండ్​కు ఆసక్తి పెరిగింది. కుటుంబం నడిపేందుకు జీతం సరిపోకపోవడంతో తల్లి మార్గరెట్​1902లో విలియం బ్రాడస్​ను పెండ్లి చేసుకుంది. ఆ తర్వాత దగ్గరలో ఉన్న గ్రీన్​వుడ్​ టౌనుకు మారింది. అయితే, సవతి తండ్రికి పిల్లలంటే పడేది కాదు. దాంతో వాళ్ళను సరిగా చూసుకొనేవాడు కాదు. 

ఇంటి నుంచి పారిపోయి...  

మార్గరెట్​ మళ్ళీ పెండ్లి చేసుకున్నా కుటుంబ పరిస్థితి మారలేదు. పేదరికం మరింత ఎక్కువైంది. పైగా పిల్లలను సవతి తండ్రి అస్సలు పట్టించుకోలేదు. దీంతో హార్లాండ్​​ చదువు ఆగిపోయింది. ఏడో తరగతితోనే స్కూల్​ మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ తోటలో పనికి వెళ్ళేవాడు. అప్పటికి హార్లాండ్ వయసు13 ఏండ్లు. ఒకరోజు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోయాడు. దగ్గరలోని ఇండియానాపోలిస్ నగరానికి వెళ్ళాడు. అక్కడ గుర్రపుబండ్లకు రంగులు వేసే పనిలో చేరాడు. కొన్ని రోజులకు ఆ పని మానేశాడు. న్యూఅల్బనీ టౌన్​లోని మేనమామ దగ్గరికి వెళ్ళాడు. 

ఉద్యోగాలు మారుతూ...

హార్లాండ్​​ మేనమామ ఒక ట్రామ్​ కంపెనీలో పనిచేసేవాడు. ఆయన సాయంతో అదే కంపెనీలో కండక్టర్​గా చేరాడు హార్లాండ్​. కొన్ని రోజులకే ఆ ఉద్యోగం మానేసి సైన్యంలో చేరాడు. క్యూబాలో అమెరికా మిలిటరీలోని వెహికల్స్​కు డ్రైవర్​గా పనిచేశాడు. ఆ తర్వాత అమెరికా సదరన్​ రైల్వే వర్క్​షాప్​లో కొన్ని రోజులు పనిచేశాడు. అనంతరం ఇల్లినాయిస్​ సెంట్రల్​ రైల్​ రోడ్​ కంపెనీలో చేరాడు. ఉద్యోగం చేస్తూనే ‘లా’ చదివేందుకు ఓ కాలేజీలో చేరాడు. ఇక్కడే జోసెఫిన్​ కింగ్​ను కలిశాడు. 1909లో జోసెఫిన్​ను పెండ్లి చేసుకున్నాడు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. హార్లాండ్​ జూనియర్​, మార్గరెట్​​, మిల్డ్రెడ్​​ రగెల్స్​. ​   ​  
పెండ్లి తర్వాత కల్నల్​ కష్టాలు మరింత పెరిగాయి. తోటి కార్మికుడితో గొడవ కావడంతో ఉద్యోగం పోయింది. దాంతో పిల్లల్ని తీసుకొని భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ‘లా’ కాలేజీలోనూ గొడవ పడి చదువు మానేశాడు. మళ్ళీ ఉద్యోగాల వేటలో పడ్డాడు. ఇన్స్యూరెన్స్​ ఏజెంట్​గా, క్రెడిట్​ కార్డ్స్​ సెల్లర్​గా, టైర్ల కంపెనీలో సేల్స్​మ్యాన్​గా పనిచేశాడు. ఏ ఉద్యోగంలోనూ కుదురుగా ఉండలేకపోయాడు. అయితే, కూడబెట్టిన డబ్బుతో 1920లో ఒక ఫెర్రీ బోట్​ కొన్నాడు. ఓహియో నది నుంచి జనాలను ఆ ఒడ్డు ఈ ఒడ్డు తిప్పేవాడు. ఒకసారి తుపాను వచ్చి అందరి పడవలు దెబ్బతిన్నాయి. ఆ టైంలో హార్లాండ్​ బోట్​ వేరే దగ్గర ఉండడం వల్ల పాడుకాలేదు. డిమాండ్​ పెరగడంతో బోట్​ ట్రిప్పుల ద్వారా ఎక్కువ డబ్బు వచ్చింది. కొన్నిరోజుల తర్వాత నదిపై ప్రభుత్వం వంతెన కట్టింది. హార్లాండ్​ బోట్​కు డిమాండ్​ తగ్గిపోయి, చేతిలో మిగిలిన డబ్బుతో లాంతర్ల కంపెనీ పెట్టాడు. అయితే, మరోసారి దురదృష్టం అతడ్ని వెంటాడింది. ‘డెల్కో ఎలక్ట్రానిక్స్​’ అనే కంపెనీ విద్యుత్​ బల్బులను మార్కెట్లోకి తెచ్చింది. దాంతో లాంతర్లు కొనేవాళ్ళు కరువయ్యారు. గిరాకీ లేక హార్లాండ్​ కంపెనీకి నష్టాలొచ్చాయి. చివరికి కంపెనీని మూసేసి, కెంటకీ రాష్ట్రంలోని నికోలస్​విల్లేలో ఉన్న స్టాండర్డ్​ ఆయిల్ గ్యాస్​ స్టేషన్​లో ఇన్​ఛార్జ్​గా చేరాడు. ఇక్కడ చేరిన కొన్ని రోజులకే అమెరికాను భయంకరమైన ఆర్థిక మాంద్యం చుట్టుముట్టింది. మళ్ళీ ఉద్యోగం పోయింది. 

రెస్టారెంట్.. రెసిపి

ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ రోజులు ఉండలేకపోవడంతో హార్లాండ్​ ఆలోచనలో పడ్డాడు.  తాను ఏ పనిలో సమర్థుడో అందులోనే ట్రై చేయాలి అనుకున్నాడు. వంటలు చేయడం.. ముఖ్యంగా చికెన్​ వండడం తన బలమని తెలుసుకొన్నాడు. వంటమనిషిగా చేరాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే నార్త్​ కార్బిన్​ అనే చిన్న టౌన్​లోని ఒక సర్వీస్​ స్టేషన్​లో వంటవాడిగా చేరాడు. కొత్త వంటలు చేసేవాడు. ముఖ్యంగా ఖాళీ టైమ్​లో చికెన్​ రెసిపీలపై ఎక్సపరిమెంట్స్​ చేసేవాడు. బాగున్న వాటిని తర్వాతి రోజు సర్వీస్​ స్టేషన్​లో వండి కస్టమర్లకు అందించేవాడు. క్రమంగా హార్లాండ్​ వంటలకు ఆదరణ పెరిగింది. కస్టమర్లు పెరిగి స్థలం​ సరిపోయేది కాదు. అది చూశాక​ సొంతంగా రెస్టారెంట్​ పెట్టాలనే కోరిక హార్లాండ్​ బుర్రని తొలిచేసింది. తన దగ్గరున్న డబ్బుతో ఒక పెద్ద జాగా కొన్నాడు. అందులో ‘శాండర్స్​ కోర్ట్​ అండ్​ కేఫ్’ పేరుతో​ రెస్టారెంట్​ మొదలుపెట్టాడు. రెస్టారెంట్​ బాధ్యతలు చూసుకుంటూనే కార్నెల్​ యూనివర్సిటీలో ఎనిమిది వారాల హోటల్​ మేనేజ్​మెంట్​ కోర్సు చేశాడు. రెస్టారెంట్​లో చేసిన వంటకాల్లో కెఎఫ్​సి కూడా ఉంది. ఈ చికెన్​ను కెంటకీ గవర్నర్​ రూబీ లఫూన్​ ఎంతో ఇష్టంగా తినేవాడు. ఆయనే హార్లాండ్​కు ‘కల్నల్’​ అనే బిరుదు ఇచ్చాడు. అప్పటి నుంచి హార్లాండ్​​ శాండర్స్​ను కల్నల్​ శాండర్స్​ అని పిలవడం మొదలుపెట్టారు. 

దశ తిరిగింది 

రెండో ప్రపంచ యుద్ధం టైమ్​లో ‘శాండర్స్​ కోర్ట్​ అండ్​ కేఫ్​’ను​ మూసేయాల్సి వచ్చింది. దీంతో కెఎఫ్​సి రెసిపీని వేరే రెస్టారెంట్లకు అమ్మేందుకు హార్లాండ్​ రెడీ అయ్యాడు. కారులో అన్ని రెస్టారెంట్ల వద్దకు  వెళ్ళేవాడు. వాటి ఓనర్ల ఎదురుగానే తన ఫార్ములాతో చికెన్​ వండేవాడు. దాన్ని రుచి చూసి, బాగుంటే ఫ్రాంఛైజీ తీసుకోమని అడిగేవాడు. అయితే,  ఒకటీ రెండూ కాదు ఏకంగా1009 రెస్టారెంట్లు కెఎఫ్​సి​ రెసిపీని రిజెక్ట్​ చేశాయి. అయినా, హార్లాండ్​ నిరాశపడలేదు. దేశమంతా తిరిగాడు. చివరికి ఒక ఫుడ్​ సెమినార్​లో పరిచయమైన పీటర్ ​హర్మాన్​ ఫ్రాంఛైజ్​ తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. అలా 1952లో ఉటా రాష్ట్రంలోని సౌత్​ సాల్ట్​ లేక్​ సిటీలో కెంటకీ ఫ్రైడ్​ చికెన్​(కెఎఫ్​సి) పేరుతో మొదటి రెస్టారెంట్​ మొదలైంది. అప్పటికి హార్లాండ్​ వయసు 62 ఏండ్లు. ఆ తర్వాత కెఎఫ్​సికి రోజురోజుకూ ఆదరణ పెరిగింది.1963 నాటికి అమెరికాలో దాదాపు 600 రెస్టారెంట్లలో కెఎఫ్​సి చికెన్​ను అమ్మడం మొదలుపెట్టారు. 1964లో జాన్​ వై. బ్రౌన్​ జూనియర్​ అనే లాయర్​కు కెఎఫ్​సిని హార్లాండ్​ అమ్మేశాడు. దీనికోసం రెండు మిలియన్​ డాలర్లు(అంటే ఇప్పటి లెక్కల్లో 15,61,83,200 రూపాయలు) తీసుకున్నాడు. అలాగే కెఎఫ్​సి క్వాలిటీ కంట్రోల్​ టీమ్​లో పర్మినెంట్​ మెంబర్​గా ఉండేలా, లోగోలో, అడ్వర్టైజ్​​మెంట్లలో కనిపించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికోసం సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల(అంటే ఇప్పటి లెక్కల్లో1,95,22,900 రూపాయలు) డాలర్లు తీసుకుంటాడు.  కాగా, కెఎఫ్​సి రోజురోజుకూ విస్తరిస్తూనే చాలా చేతులు మారింది. చివరికి 1986లో పెప్సీకో తీసుకుంది. ప్రస్తుతం పెప్సీకో ‘యమ్​’  బ్రాండ్​ కింద కెఎఫ్​సి 150కి పైగా దేశాల్లో ఔట్​లెట్లు తెరిచింది. ఇప్పుడు మొత్తం 23వేలకు పైగా ఔట్​లెట్లు ఉన్నాయి.  కెఎఫ్​సి బ్రాండ్​ విలువ ఏకంగా 9.5 బిలియన్​ డాలర్లకుపైనే ఉంది ఇప్పుడు.           

పేరు పెట్టింది శాండర్స్​ కాదు!

కెఎఫ్​సి రెసీపీని తయారుచేసింది, లోగోలో కనిపించేది హార్లాండే. కానీ,  ‘కెంటకీ ఫ్రైడ్​ చికెన్’ అని పేరు పెట్టింది మాత్రం హార్లాండ్​ కాదు. ఫ్రాంచైజీలో పనిచేసే ఒక పెయింటర్​ ఈ పేరు పెట్టాడు. కానీ, అతని పేరు మాత్రం తెలియదు. కెంటకీలోని నార్త్​ కార్బిన్​ నగరంలో శాండర్స్​​ రెస్టారెంట్​ మొదలుపెట్టిన చోట ఇప్పుడు ఒక మ్యూజియం ఉంది. 

‘కల్నల్’గా బిరుదు వచ్చాక హార్లాండ్​​ తెల్లటి కోటు వేసుకునేవాడు. ఆయన​ చనిపోయాక ఈ కోటును వేలం వేశారు. దీన్ని కెఎఫ్​సి జపాన్​ సీఈవో మసావో చార్లీ వతనబె 21,510 డాలర్లకు కొనుక్కున్నాడు. అంతేకాదు, హార్లాండ్​​ డ్రైవింగ్​ లైసెన్స్​ను 1,192 డాలర్లకు తీసుకున్నాడు. ‘కల్నల్ క్వెస్ట్​’ పేరుతో హార్లాండ్​కు సొంత వీడియో గేమ్​ ఉంది. అలాగే ‘కల్నల్స్​ అడ్వెంచర్​ కామిక్స్​’ పేరుతో ఒక కామిక్​ బుక్​ కూడా ఉంది. ఇందులో కెఎఫ్​సిని కనిపెట్టడానికి కారణమైన విషయాలు ఉన్నాయి. 
    

కెఎఫ్​సి లోగోలో ఉండే ‘ఫింగర్​–లికింగ్​ గుడ్​’ క్యాప్షన్​ చైనాలో కొన్నిచోట్ల తప్పుగా ప్రచారమైంది. దీన్ని చైనీయులు ‘ఈట్​ యువర్​ ఫింగర్స్​’ అని అర్థం చేసుకున్నారట! ఆ తర్వాత సరిదిద్దారు. ప్రస్తుతం ఒక్క చైనాలోనే దాదాపు 5వేల కెఎఫ్​సి రెస్టారెంట్లు ఉన్నాయి. క్రిస్​మస్​ రోజు కెఎఫ్​సి చికెన్​ తినడం జపాన్​లో 1974 నుంచి సంప్రదాయంగా మారిపోయింది. క్రిస్​మస్​ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ కచ్చితంగా కెఎఫ్​సి చికెన్​ తినాలి అనుకుంటారు. అంతేకాదు, జపాన్​లో నవంబర్​ నుంచి డిసెంబర్​ 25న క్రిస్​మస్​ వరకు కెఎఫ్​సి అమ్మకాలు విపరీతంగా ఉంటాయి. 
ž

రహస్యం లాకర్​లో.. 

కెఎఫ్​సి రెసీపీని11రకాల హెర్బల్స్​, మసాలాలతో తయారుచేసినట్లు హార్లాండ్​ చెప్పేవాడు. అయితే, వాటి వివరాలు మాత్రం రహస్యంగా ఉంచాడు. చాలా ఏండ్ల పాటు ఈ ఫార్ములా కేవలం హార్లాండ్​​ మెదడులో మాత్రమే ఉండేది. ఆ తర్వాత ​ఒక కాగితంపై రాసి తన వ్యాలెట్​లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ కాగితం లూయిస్​విల్లేలోని కెఎఫ్​సి హెడ్​క్వార్టర్స్​లో ఒక లాకర్​లో ఉంది. ఈ లాకర్​ ఉన్న గదిలోకి వెళ్లేందుకు కేవలం కొంతమంది మెంబర్లకు మాత్రమే అనుమతి ఉంది. 1940 నుంచి ఇదే ఫార్ములాను వాడుతున్నారు. అయితే, నూనెను మాత్రం మార్చారు. ఈ రెసిపీని చేసేందుకు ఇప్పటివరకూ చాలామంది ప్రయత్నించారు. కానీ, ఎవరూ సక్సెస్​ కాలేకపోయారు.