ముంచెత్తిన వాన.. నిజామాబాద్​ సిటీలోని సుమారు 20 కాలనీలు జలమయం

ముంచెత్తిన వాన.. నిజామాబాద్​ సిటీలోని సుమారు 20 కాలనీలు జలమయం

నిజామాబాద్, వెలుగు: తెడతెరపి లేని వర్షం జిల్లా ను ముంచెత్తింది. గురువారం ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని కాలనీలన్నీ జలమయమయ్యాయి. నాగారం, భారతీ రాణి కాలనీ, పుజారీ కాలనీ, బాబన్​సాబ్​ పహాడీ, దొడ్డి కొమరయ్య తదితర కాలనీల్లో వరదనీరు పోటెత్తింది. మానిక్​భండార్ ​చౌరస్తా, శివాజీ నగర్ కాలనీల్లోనూ వరద నీటి ప్రభావం అధికంగా ఉంది. మున్సిపల్ లో విలీనమైన బోర్గాం, పాంగ్రా, ముబారక్​నగర్, సారంగాపూర్​ వీధులు నీటితో నిండాయి.​ చాలాచోట్ల జనం ఇండ్లు దాటి బయటకు రాలేకపోయారు. జిల్లా మొత్తం గురువారం ఒక్కరోజే 246 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఎర్గట్లలో అత్యధికంగా15.9 సెం.మీ, కమ్మర్​పల్లి 14.3 సెం.మీ., మోర్తాడ్​ 13.3 సెం.మీ., భీమ్​గల్​లో 12.4సెం.మీ., మెండోరాలో 12.3 సెం.మీ., బాల్కొండ లో  11.9, వేల్పూర్​లో 10.5, ముప్కాల్​లో 10.3, ఆలూరులో 8.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.

నిజామాబాద్, వేల్పూర్,​ కమ్మర్​పల్లి, బోధన్, భాగేపల్లి, దూద్​గావ్, నవీపేటలో ఇండ్లు దెబ్బతిన్న 76 కుటుంబాలను శిబిరాలకు తరలించారు. నగరంలోని అర్సాపల్లి, ఖానాపూర్, బోధన్​లోని ఊట్​పల్లి, మావందిఖుర్దు, వర్ని జలాల్​పూర్, నందిపేట, తల్వేద, కుద్వాన్​పూర్, నవీపేట కోస్లీ, ఆర్మూర్​లోని మంధని, గోవింద్​పేట, సాహెబ్​పేట్​కు రోడ్ల మీదుగా ట్రాఫిక్​ నిలిపేశారు. కొన్ని చోట్ల రోడ్లు కట్​కాగా, మరి కొన్ని చోట్ల రోడ్ల మీదుగా భారీగా నీరుపారుతోంది. జిల్లా వ్యాప్తంగా 5,598 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. సాలూరా వద్ద మంజీరా నది ప్రవాహం పెరగడంతో గురువారం సాయంత్రం నుంచి మహారాష్ట్రకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా, గోదావరి నదులు ఎస్పారెస్పీ ప్రాజెక్ట్​ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్​ చేశారు. 

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం పడింది. భారీ వానలతో జనజీవనం స్తంభించింది. గాంధారిలో అత్యధికంగా 9.5 సెం.మీ., నస్రుల్లాబాద్​లో 8.9 సెం.మీ., బొమ్మదేవునిపల్లిలో  8.4 సెం.మీ., ఇసాయిపేటలో 8.2 సెం.మీ., కామారెడ్డిలో 7.2 సెం.మీ., తాడ్వాయిలో 7 సెం.మీ., బీర్కూర్​లో  6.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.. జిల్లావ్యాప్తంగా 6 ఇండ్లు పూర్తిగా కూలగా, 284  ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జుక్కల్, గాంధారి, సదాశివ్​నగర్ ​మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.​ వాగులు పొంగి ప్రవహించడంతో పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచారెడ్డి, పాల్వంచ, కామారెడ్డి, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, సదాశివ్​నగర్, రామారెడ్డి, భిక్కనూరు మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగంపేట మండలంలో పెద్ద వాగు ప్రవాహంతో నాగారం వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. కామారెడ్డి లోని పలు  కాలనీలో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి. సరంపల్లి శివారులోని బూకాన్​ హనుమాన్​ టెంపుల్​సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా నీళ్లు చేరాయి.

ALSO READ :దేవాలయ హుండీ దొంగల అరెస్ట్

కేజ్​వీల్​పై పేషెంట్​ తరలింపు..

సదాశివ్​నగర్​మండలం అమర్లబండకు చెందిన సుంకరి దివ్య కు ఛాతిలో నొప్పి వచ్చింది. హాస్పిటల్​కు వెళ్దామంటే ఓ వైపు వాగు ప్రవహిస్తుంటే మరో వైపు చెరువు అలుగు పారుతోంది. ఈ పరిస్థితుల్లో స్థానికులు ట్రాక్టర్ ​కేజ్​వీల్​పై పేషెంట్​ను కూర్చొబెట్టి, వాగు దాటించారు. ఆ తర్వాత పోలీస్ ​వెహికిల్​లో జిల్లా కేంద్రంలోని హాస్పిటల్​కు తరలించారు.