ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

పరిహారం కోసం కుటుంబీకుల ధర్నా

రామకృష్ణాపూర, వెలుగు:  మందమర్రి మండలంలోని  గద్దెరాగడిలోని జాన్​ డీర్​  ట్రాక్టర్​ షోరూమ్​ ఎదుట మెకానిక్​  గారె జాన్​ప్రశాంత్​(22) శవంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. డ్యూటీలో ఉండి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మెకానిక్​ మరణానికి షోరూమ్​ యాజమాన్యమే కారణమంటూ రూ.30లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడారు. జాన్​ప్రశాంత్​ షోరూమ్​లో 9 నెలలుగా  మెకానిక్​గా పనిచేస్తున్నాడని,  సెప్టెంబర్​ 15న డ్యూటీలో భాగంగా హాజీపూర్​ మండలం గుడిపేటలో ట్రాక్టర్​ రిపేర్​ చేసి బైక్​పై తిరిగి వస్తుండగా ముల్కల వద్ద ఆటో ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆయన   తలకు తీవ్ర గాయాలకు కావడంతో పాటు కిడ్నిలు సైతం ఫెలయ్యాయని, హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి జాన్​ ప్రశాంత్​ చనిపోయాడన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా షోరూమ్​ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు.    మందమర్రి సీఐ ప్రమోద్​రావు, రామకృష్ణాపూర్​, కాసీపేట ఎస్సైలు అశోక్​, ఫరీద్​, గంగారం, పోలీసులు పెద్ద సంఖ్యలో  ఘటన స్థలానికి చేరుకున్నారు.  షోరూమ్​ యాజమాన్యంతో పరిహారం విషయంపై సీఐ ప్రమోద్​రావు, మున్సిపల్​ కౌన్సిలర్​ పారుపల్లి తిరుపతిలు ఫోన్​లో చర్చించారు.  ఆసుపత్రిలో చిక్సిత్స కోసం అందించిన రూ.3లక్షలకు  అదనంగా బాధిత కుటుంబానికి  రూ.9లక్షలను అందిస్తామని   షోరూమ్​ హెచ్​ఆర్​ విష్ణువర్ధన్​ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

బెల్లంపల్లిలో రైళ్ల హాల్టింగ్ కు  జీఎం హామీ

బెల్లంపల్లి, వెలుగు :  బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళ హాల్టింగ్ కు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ హామీ ఇచ్చారు.  పట్టణంలోని రైల్వే స్టేషన్ ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్  పార్క్,   ఓపెన్ జిమ్ ను  ప్రారంభించారు.   అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ కో కన్వీనర్ రాజులాల్ యాదవ్, జిల్లా కార్యదర్శి కోయిల్కార్ గోవర్థన్, లీడర్ వెంగల రాజమల్లు,  కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్ చార్జి చిలుముల శంకర్, టౌన్ ప్రెసిడెంట్ కంకటి శ్రీనివాస్, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రొడ్డ శారద  పలు సమస్యలపై జీఎంకు వినతిపత్రాలు అందించారు.    రైల్వే స్టేషన్ లో గ్రాండ్ ట్రంక్, ఏపీ, నవజీవన్, దక్షిణ్ ఎక్స్ ప్రెస్, సంపర్ క్రాంతి, కేరళ  ఎక్స్ ప్రెస్ రైళ్ళకు హాల్టింగ్ ఇవ్వాలని జీఎంను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.  ఆయనతోపాటు డీఆర్ఎం మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా,  రైల్వే ఉన్నత అధికారులు ఆర్ కె,  సిన్హా, డాక్టర్ దొర రామారావు, గణేశ్​ కుమార్, దైవేది ఉన్నారు. 

జీఎం వస్తారని ఏర్పాట్లు.. చివరికి నిరాశ..

 కాగ జ్ నగర్,వెలుగు : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్​కు శుక్రవారం రావాల్సి ఉండగా ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేశారు.   అధికారులతో కలిసి ఆయన క్వార్టర్ లకు నీటి సరఫరా ట్యాంక్ ప్రారంభించాల్సింది.  కానీ జీఎం  స్పెషల్ ట్రైన్ లో  నేరుగా మహారాష్ట్ర లోని మాణిక్ ఘడ్ కు వెళ్లారు.  జీఎం వస్తాడని చీకటిపడేదాక ఎదురు చూసిన అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్ లు ఆయన స్టేషన్లో దిగక పోవడం తో నిరాశ చెందారు. జీఎం పర్యటన కోసం గత వారం రోజులుగా స్టేషన్ ను, పరిసరాలను శుభ్రంగా తయారు చేసిన అధికారులు, రంగులు వేసి , మొక్కలు తెచ్చి, గోడలకు సున్నాలు, చిత్రాలు గీయించి సుందరంగా తయారీ చేసిన అధికారులు చివరకు నిట్టూర్చారు.  వినతి పత్రాలు అందిస్తామని వేచి చూసిన వాళ్ళు కూడా చివరకు చేసేది లేక వెనుదిరిగారు.

వికలాంగుల గ్రీవెన్స్​కు భారీ స్పందన

అర్జీలు స్వీకరించిన అధికారులు 

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు :   కలెక్టరేట్​లో శుక్రవారం  వికలాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్​ నిర్వహించారు.  కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి  అనూహ్య స్పందన వచ్చింది.  ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ..  సదరం సర్టిఫికెట్ల కోసం,  పింఛన్ల కోసం సుమారు 200 అర్జీలను తీసుకున్నట్టు  చెప్పారు.   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు ఇస్తామని, రుణాలు మంజూరయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.  అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 3న మరోసారి అర్జీలు స్వీకరిందచేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పారు.   ఇంద్రవెల్లి మండలంలో పింఛన్ల కోసం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెల్లాల్సి వస్తోందని కొందరు,  తమకు సదరం సర్టిఫికేట్  ఉన్నా ఫించన్లు రావడం లేదని,  పింఛను డబ్బుల పంపిణీదారులు చిల్లర డబ్బులు ఇవ్వకుండా వారే ఉంచుకుంటున్నారని కొందరు కలెక్టర్​ దృష్టికి తెచ్చారు.  కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ ఎన్​. నటరాజ్​, అడిషనల్​ ఎస్పీ శ్రీనివాస్​రావు, ఆర్డీఓ రమేష్​ రాథోడ్​, డీఆర్​ఓ అరవింద్​కుమార్​, ఐసీడీఎస్​ పీడీ మిల్కా, డీఆర్​డీఓ కిషన్​, ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

సైన్స్ ఫెయిర్ కు స్పందన

ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు 

బెల్లంపల్లి, వెలుగు : పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో శుక్రవారం జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ ను సంక్షేమ గురుకులాల జాయింట్ సెక్రటరీ ఆర్. అనంతలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీకి ఆర్సీవో కొప్పుల స్వరూప రాణి, ప్రిన్సిపల్ స్వరూప   బొకే అందించారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలను వారు పరిశీలించారు.   గురుకుల విద్యార్థులు ప్రతిభను మెచ్చుకున్నారు. ఉత్తమ ప్రదర్శనలను, ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించాలని ఆమె ఆర్సీవో కు సూచించారు. పది జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు మూడు రోజులపాటు భోజన వసతి కల్పించినట్లు ఆర్సీవో స్వరూప రాణి వివరించారు. అంతేకాకుండా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డీనేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం విద్యార్థుల ప్రదర్శనలు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఐనాల సైదులు, సూపరిండెంట్ గుజ్జుల సమ్మయ్య, కేవీకే శాస్త్రవేత్తలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. 
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్లో ఇన్​స్పైర్​ , సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రదర్శనలు చూసేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చారు. 500 కు పైగా ప్రదర్శనలు ఉన్నట్టు డీఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లా నుంచి దాదాపు 10 వరకు పరిశోధనలు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. సైన్స్ ఫెయిర్ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈకార్యక్రమంలో సైన్స్ ఫెయిర్ రాష్ట్ర పరిశీలకుడు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

డబుల్​ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక

  •     లక్కీ డ్రా తీసిన కలెక్టర్​
  •     అనర్హులకు ఇస్తున్నారని పలువురి ఆందోళన

నిర్మల్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అన్నారు. బంగల్పేట్, నాయిపేట లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లక్కీ డ్రా ద్వారా శుక్రవారం లబ్ధిదారులకు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తిస్థాయి విచారణ తర్వాత లబ్ధిదారులనుఎంపిక చేశామన్నారు. ఇండ్ల మంజూరులో ఎవరూ దళారులను నమ్మొద్దని సూచించారు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. లాటరీ పద్ధతి ద్వారానే వార్డు ల వారీగా ఇండ్లు ఇచ్చామని, తెలిపారు. మొత్తం 1248 ఇళ్లను అర్హులైన వారికి కేటాయించామని సంక్రాంతి లోపు ఇండ్లను పూర్తిచేసి గృహప్రవేశాలు చేపడతామన్నారు. కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్ లు హేమంత్ బోర్ కడే, రాంబాబు, డీఎస్పీ జీవన్ రెడ్డి, తహసీల్దార్​ సుభాష్ చంద్ర, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆందోళన... 

పట్టణంలోని 42 వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి 20 మంది లబ్ధి దారులను అర్హులుగా గుర్తించారు. కొంతమంది ఇండ్లున్న వారికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించారంటూ కొందరు మహిళలు ఆందోళన చేశారు. కలెక్టరేట్ ను ముట్టడించారు. దాదాపు గంటకు పైగా ప్రభుత్వానికి, కలెక్టర్ కు వ్యతిరే కంగా నినాదాలు చేశారు. మరో ఫంక్షన్ హాల్ వద్ద కాంగ్రెస్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఆధ్వర్యంలో పేదలంతా బైఠాయించి నిరసన తెలిపారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఇండ్లు కేటాయించారని అన్నారు. 

విచారణ జరపాలి : బీజేపీ 

డబుల్ ఇండ్ల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన గారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్​, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసిమ్మరాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, జిల్లా కార్యదర్శి గాదె విలాస్ డిమాండ్​ చేశారు. పార్టీ ఆఫీస్​ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల ఒత్తిళ్ళ వల్లే అసలైన లబ్ధిదారులకు ఇండ్లు రాలేవని 
ఆరోపించారు. 

జేపీ నడ్డాను కలిసిన రామారావు పటేల్

భైంసా, వెలుగు : నిర్మల్​ డీసీసీ మాజీ అధ్యక్షులు రామారావు పటేల్​ శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ఢిల్లీలో కలిశారు.  ఈ నెల 28న రామారావు  బీజేపీలో చేరనున్న నేపథ్యంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చినట్లు రామారావు పటేల్​ తెలిపారు. బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రలో రామారావు పటేల్​ అధికారికంగా బీజేపీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు. 

'బండి' పాదయాత్రకు వేలాదిగా తరలిరండి

    బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్​రావు పటేల్​

భైంసా, వెలుగు :  భైంసా నుంచి సోమవారం ప్రారంభమయ్యే బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రతో పాటు బహిరంగ సభకు కార్యకర్తలు,  వేలాదిగా తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్​రావు పటేల్​ కోరారు. శుక్రవారం కుంటాల మండలం బూరుగుపల్లి, గోల్లమాడ లో  మీటింగ్​ నిర్వహించారు.  కేసీఆర్​ను గద్దెదించేందుకు చేసేందుకు ఈ యాత్ర  చేస్తున్నట్టు చెప్పారు.  ముథోల్​లో కాషాయ జెండా ఎగురవేసి బండి సంజయ్​తో పాటు ప్రధాని మోడీకి గిఫ్ట్​ ఇద్దామని అన్నారు. సాయంత్రం కుభీర్​ మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలను కలిశారు. భైంసాలోని దారాబ్జీ జిన్నింగ్​ ఫ్యాక్టరీలో యువజన సంఘాలతో మీటింగ్​ ఏర్పాటు చేసి యాత్రపై చర్చించారు. ఇందులో మాజీ ఎంపీపీ సుభాష్​ జాదవ్​, లీడర్లు ఉన్నారు.

మందమర్రి పోలీస్​స్టేషన్​ తనిఖీ

మందమర్రి,వెలుగు: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని మంచిర్యాల డీసీపీ అఖిల్​ మహాజన్​ అన్నారు. మందమర్రి పోలీస్​స్టేషన్​ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరు, రిసెప్షన్​, బ్లూ కోల్ట్స్​, క్రైం టీం, కోర్టుడ్యూటీ ఆఫీసర్​ తదితర రికార్డులను పరిశీలించారు. జపాన్​ టెక్నాలజీతో రూపొందించిన 5ఎస్​ విధానాన్ని తనిఖీ చేశరు. డ్యూటీల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్​, మందమర్రి సీఐ ప్రమోద్​రావు, ఎస్సైలు చంద్రకుమార్, మహేందర్​​, రామన్న తదితరులు 
పాల్గొన్నారు.