ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

    కలెక్టర్ రాహుల్ రాజ్

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని   గోదాంలలో  టైట్​ సెక్యూరిటీ  మధ్య ఈవీఎంలను  భద్రపరిచామని  కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ రాజేశం, డీఆర్వో  రాజేశ్వర్ లతో కలిసి గోదాంలను  సందర్శించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఈసీఎల్​  నుంచి  వచ్చిన  వేయి 57 బ్యాలట్​  యూనిట్లు, 825 కంట్రోల్ యూనిట్లను స్కాన్ చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి భద్రపరిచినట్టు తెలిపారు.  కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, డీటీలు  జితేందర్, పోచయ్య, రవీందర్  పాల్గొన్నారు.

గుండి వాగు బ్రిడ్జి  పనులను త్వరగా చేయాలి ..  

 మండలంలోని  గుండి వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని  కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గుండి వాగు  వంతెనను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆయనతోపాటు పంచాయతీ రాజ్ ఈ ఈ రామ్మోహన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశ్​  తదితరులు పాల్గొన్నారు.  

తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలి: అడిషనల్​ కలెక్టర్​ బి.రాహుల్​

రామకృష్ణాపూర్, వెలుగు: మున్సిపాలిటీ వార్డుల్లో పారిశుధ్య నిర్వహణకు స్థానికులు సహకరించాలని, తడి పొడి చెత్తను   వేరు చేసి, మున్సిపల్​ సిబ్బందికి అందించాలని  అడిషనల్​ కలెక్టర్​ బి.రాహుల్ అన్నారు. మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఒకటో వార్డు పరిధిలో సానిటేషన్​ నిర్వహణ, చెత్త సేకరణను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్త సేకరణ, వాహనాలకు అందించడంపై స్థానికులు అవగాహన కల్పించారు. అనంతరం రాజీవ్​చౌక్​లోని కూరగాయల మార్కెట్​లో వ్యాపారులతో మాట్లాడారు.  అడిషనల్​కలెక్టర్​ వెంట మున్సిపల్​ చైర్​ పర్సన్​ జంగం కళ, కమిషనర్​ వెంకటనారాయణ, మేనేజర్​ నాగరాజు, కౌన్సిలర్​ పోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోని సర్కార్​: బీజేపీ జిల్లా జనరల్​ సెక్రటరీ శ్రీనివాస్​ 

మందమర్రి, వెలుగు:  కాళేశ్వరం బ్యాక్​ వాటర్​ వల్ల నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా  రాష్ట్ర సర్కార్​, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్​ పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా జనరల్​ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్​ ఆరోపించారు. మందమర్రిలోని పార్టీ ఆఫీస్​లో మంగళవారం   ఆయన మీడియా తో  మాట్లాడారు. మందమర్రి ఏరియాలో టీబీజీకేఎస్​ లీడర్లు ఒక్కొక్కరు రెండు నుంచి మూడు సింగరేణి క్వార్టర్లను కబ్జాలు చేసుకోవడంతో అర్హులైన సింగరేణి కార్మికులకు క్వార్టర్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. నియోజకవర్గంలో ఇసుక,ల్యాండ్​ మాఫియా పెరిగిపోతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను స్థానిక ఎమ్మెల్యే నెరవేర్చలేదని ఆరోపించారు.  సమావేశంలో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ సప్పిడి నరేశ్​, లీడర్లు దీక్షితులు, టౌన్​ జనరల్​ సెక్రటరీ గడ్డం శ్రీనివాస్​, సురేందర్​, కిరణ్​, రంజిత్​సాయి, సందీప్​, సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.

కంటి వెలుగు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలె

నిర్మల్, వెలుగు:  జిల్లాలో  ఈనెల 18 నుంచి  చేపట్టే  కంటి వెలుగు  కార్యక్రమాన్ని  పకడ్బందీగా   నిర్వహించాలని    మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మంగళవారం  కలెక్టరేట్ లో   హరీశ్​ రావు తో నిర్వహించిన  వీడియో  కాన్ఫరెన్స్ లో  పాల్గొన్న  అనంతరం మంత్రి మీడియాతో  మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం  చేపడుతున్న  కంటి వెలుగు  కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ  భాగస్వామ్యం పంచుకోవాలని సూచించారు.  అన్ని శాఖల  అధికారులు  ఈ  కార్యక్రమాన్ని  విజయవంతం చేసేందుకు బాధ్యతాయుతంగా  పనిచేయాలన్నారు.  ఈ  సమావేశంలో  జడ్పి చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలి ఫారుకి, మున్సిపల్ చైర్మన్లు  ఈశ్వర్, అంకం రాజేందర్, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో కంటి వెలుగు ప్రోగ్రాం కోసం 40 బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్​ భారతి హోళికేరి తెలిపారు. 

వైద్యాధికారి ఆధ్వర్యంలో ఒక్కో బృందంలో 8మంది సిబ్బంది ఉంటారన్నారు. ఈ నెల 18న ప్రారంభంకానున్న కంటివెలుగుపై హెల్త్​ మినిస్టర్​ హరీశ్​​రావు మంగళవారం హైదరాబాద్​ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లాలోని 310 గ్రామీణ, 174 పట్టణ ప్రాంతాల్లో శిబిరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 9.38 లక్షల మందికి సేవలు అందిస్తామన్నారు. 40 మంది ఆఫ్తాల్మిక్​ ఆఫీసర్లను నయమించి ట్రెయినింగ్​ ఇచ్చామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు దివాకర్​రావు, చిన్నయ్య, జడ్పీ చైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, అడిషనల్​ కలెక్టర్​ బి.రాహుల్​, డీఎంహెచ్​వో సుబ్బరాయుడు   తదితరులు పాల్గొన్నారు.  

సావిత్రి బాయికి ఘన నివాళి

భారతదేశ తొలి మహిళా టీచర్​ , సంఘ సంస్కర్త సావిత్రి బాయి 192వ జయంతిని  మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.  ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, అధికారులు, నాయకులు సావిత్రి బాయికి నివాళులర్పించారు. మహిళల చదువు కోసం సావిత్రి బాయి పోరాటం మరువలేనిదని, ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి తరం విద్యార్థులు చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. - వెలుగు, నెట్​వర్క్

సింగరేణిలో  పోటీలను సక్సెస్​ చేయాలె

మందమర్రి/ రామకృష్ణాపూర్​,వెలుగు:  మందమర్రిలోని  ఇల్లందు క్లబ్​, సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో ఈనెల 5 , 6 తేదీల్లో నిర్వహించే సింగరేణి స్థాయి  ​టెన్నిస్​, బాస్కెట్​బాల్​ పోటీలను సక్సెస్​ చేయాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్​ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం  గ్రౌండ్​, క్లబ్​లో ఏర్పాట్లను   పరిశీలించారు. అంతకు ముందు ఏరియాలోని ఆర్కే1ఏ గనితోపాటు ఇతర గనులు, డిపార్ట్​మెంట్లపై నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఎంప్లాయిస్​, ఆఫీసర్లు శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం అన్ని ఏరియాల జీఎంలతో సింగరేణి సీఎండీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లోజీఎం పాల్గొన్నారు.  

 పంచాయతీ నిధులను పక్కదారి పట్టిస్తున్రు

మందమర్రి, వెలుగు:  కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన రూ.700 కోట్ల నిధులను రాష్ట్ర సర్కార్​ పక్కదారి పట్టించి గోల్​మాల్​ చేసిందని, ఇది చట్టవిరుద్దమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొనగంటి రంగారావు అన్నారు. మంగళవారం మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో బీజేపీ మండల ప్రెసిడెంట్​ పైడిమల్ల నర్సింగ్​ ఆధ్వర్యంలో  శక్తి కేంద్రం సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల నుంచి రాష్ట్ర సర్కార్​ అభివృద్ధి కోసం ఖాతాల్లో వేసిన మొత్తాన్ని గంటల వ్యవధిలో  సర్పంచులకు తెలియకుండా మళ్లించిందని ఆరోపించారు.  బూత్​ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టౌన్​ ప్రెసిడెంట్ పైడిమల్ల నర్సింగ్​,  దీక్షితులు, శక్తి కేంద్రం ఇన్​చార్జి పళ్ల పవన్​కుమార్​, బూత్​ ప్రెసిడెంట్లు మరినేని పోశం, మంద రాజురెడ్డి, మారినేని రామయ్య దుర్గం వెంకటేశ్​,  జుమ్మిడి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. 

పులి తిరుగుతోంది పైలం

బెల్లంపల్లి రూరల్​​,వెలుగు:  నెన్నెల మండలంలోని కోణంపేట, శ్రావణ్​పల్లి శివారు ప్రాణహిత కాలువ అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పాదముద్రలను గుర్తించారు. కుశ్నపల్లి అటవీ ప్రాంతం మీదుగా కోణంపేట శివారులో సంచరిస్తూ నీలవాయి, ఒడ్డుగూడ ప్రాంతానికి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా గుర్తించారు. అటవీ శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో  పొలాలకు, పత్తి చేళ్లకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని  దండోరా వేయించారు. బుధవారం అటవీ అధికారులు కోణంపేటలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.