ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  •     తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్
  •     భయాందోళనలో ప్రజలు
  •     మెట్​పల్లి పరిధిలో మూడు నెల్లలో 20కి పైగా చోరీలు

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి ప్రాంతంలో వరుస చోరీలతో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. తాళం వేసిన దుకాణాలు, ఇండ్లను టార్గెట్‌‌‌‌ చేసుకుని రూ.లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్తున్నారు. మెట్ పల్లి సర్కిల్ పరిధిలో మూడు నెలల వ్యవధిలో సుమారు 20కు పైగా చోరీలు జరిగాయి. పది రోజుల క్రితం డిసెంబర్ 21 ఒక్క రాత్రిలోనే మెట్ పల్లిలోని 12 దుకాణాల్లో దొంగలు చొరబడి రూ.లక్షల విలువ చేసే సొత్తు దోచుకెళ్లారు. అంతకుముందు నవంబర్ 2, 3, 11 తేదీల్లో హనుమాన్ నగర్, ఆదర్శనగర్ లలో తాళం వేసిన పలు ఇండ్లలో చోరీలు జరిగాయి. దొంగలు ఉదయం పూట ఆయా కాలనీల్లో రెక్కి నిర్వహించి రాత్రుల్లో చోరీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందినవారా?  మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్ నుంచి జిల్లాలోకి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. 

రాత్రి పూట కానరాని పెట్రోలింగ్..

చోరీ జరిగిన విషయం చెప్పగానే పోలీసులు ఘటనా స్థలానికి ఆలస్యంగా వస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తే క్రిమినల్స్ మూమెంట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ సిబ్బందికి  కేటాయించిన రూట్ మ్యాప్ లో మొక్కుబడిగా తిరగడం, కేటాయించిన టైం వరకు పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఒక్కో పోలీస్ స్టేషన్ లో రెండు బ్లూకోల్ట్స్​ టీమ్ లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్ పరిధిలో రెండు షిఫ్టులుగా బ్లూ కోల్ట్స్​ టీం సభ్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా వరుస చోరీలు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే చోరీలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు

పట్టణంలో చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దొంగలను పట్టుకోవడానికి రెండు టీమ్ లు ఏర్పాటు చేశాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌‌‌‌ పెంచాం. ఊరికి వెళ్లే వారు వారి పరిధిలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరస్థులను సులభంగా పట్టుకోవచ్చు. - లక్ష్మీనారాయణ, సీఐ, మెట్ పల్లి.

కిటకిటలాడిన రాజన్న ఆలయం

వేములవాడ, వెలుగు : కొత్త సంవత్సరం సందర్భంగా ప్రసిద్ధ రాజరాజేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత ధర్మగుండంలో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు, ధర్మదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్ర్తం అందజేశారు. వారి వెంట చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, లీడర్లు రమేశ్, కొమరయ్య, ప్రదీప్ తదతరులు 
ఉన్నారు. 

నేడు రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి

వేములవాడ,వెలుగు : ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేడు శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారు భక్తులకు ఉత్తరద్వార దర్శనం ఇవ్వనున్నారు. ప్రాతఃకాల పూజ అనంతరము ఉదయం 5.10 గంటల నుంచి స్వామివార్లు పల్లకీపై ఉత్తర ద్వారా ప్రవేశం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.  

బొగ్గు ఉత్పత్తిలో మనమే నంబర్‌‌‌‌‌‌‌‌ వన్:  జీఎం నారాయణ 

గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో రామగుండం ఆర్జీ1 ఏరియా మొదటి స్థానంలో ఉందని జనరల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్ కల్వల నారాయణ తెలిపారు. ఆదివారం ఆర్‌‌‌‌‌‌‌‌సీఓఏ క్లబ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్జీ1 ఏరియాలో ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి డిసెంబర్‌‌‌‌‌‌‌‌ వరకు గడిచిన 9 నెలల కాలంలో 28.23 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌‌‌‌‌‌‌‌గా నిర్ణయించగా 32.43 లక్షల టన్నులతో 115 శాతంతో సింగరేణిలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. వచ్చే మూడు నెలల్లో వార్షిక లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

జీడీకే 11వ గనిలో నడుస్తున్న కంటిన్యూయస్‌‌‌‌‌‌‌‌ మైనర్‌‌‌‌‌‌‌‌ మెషీన్ల ద్వారా వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి సాధించామని, ఇది సింగరేణిలోనే రికార్డు అని జీఎం తెలిపారు. సింగరేణి స్టేడియంలో సింథటిక్‌‌‌‌‌‌‌‌ వాకింగ్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌, ఓపెన్‌‌‌‌‌‌‌‌ జిమ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు రూ.31 లక్షలతో ప్రపోజల్‌‌‌‌‌‌‌‌ పంపించామన్నారు. పోలీస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల కోసం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన పరీక్షలో ఆర్జీ 1 ఏరియా నుంచి 130 మంది సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యారన్నారు. సమావేశంలో ఆఫీసర్లు బి.సైదులు, చిలుక శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌, రామకృష్ణ, నవీన్‌‌‌‌‌‌‌‌, మదన్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌, లక్ష్మీనారాయణ, ఆంజనేయప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

రిజర్వేషన్​ ఆశచూపి మోసం చేస్తున్నాయ: మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు 

పెద్దపల్లి, వెలుగు: ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల ఆశ చూపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులు కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీని తుంగలో తొక్కాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే  ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించామని  గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు గోపగాని సారయ్య గౌడ్, సయ్యుద్ మస్రత్, అక్బర్ అలీ, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్, తాండూరి శ్రీమాన్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఎండీ సర్వేర్ పాషా పాల్గొన్నారు .

‘భీమా కోరేగాం’ స్ఫూర్తితో పోరాడాలి

గోదావరిఖని, వెలుగు : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భీమా కోరేగాం విజయం స్ఫూర్తిగా పోరాడాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. భీమా కోరేగాం యుద్ధం ముగిసి 205 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత నేతలు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి పీష్వా రాజులపై మహార్ సేనలు చేసిన యుద్ధాన్ని ప్రజలు స్మరించుకోవాలన్నారు. మహార్ వీరుల పోరాటాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో సింగరేణి లైసెన్ ఆఫీసర్ రాజయ్య, సింగరేణి ఎస్‌‌‌‌‌‌‌‌సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వైజర్ మోహన్, తెలంగాణ దళిత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామమూర్తి  తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో తపస్ జిల్లా శాఖ రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ​ పూర్తిస్థాయి లో అభివృద్ధి చేస్తామన్నారు. అంద రం కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవయ్య, ప్రసాదరావు, తపస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరేందర్ రావు, వార్డ్ కౌన్సిలర్ నవీన్, రాష్ట్ర బాధ్యులు మైపాల్ రెడ్డి  పాల్గొన్నారు.