జిల్లాల మార్పుపై కమిషన్ వేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్

జిల్లాల మార్పుపై కమిషన్ వేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్

 హుజూర్ నగర్, గరిడేపల్లి,  మఠంపల్లి, వెలుగు: గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిందని, వాటిని పునఃపరిశీలించేందుకు త్వరలో కమిషన్ వేస్తామని ఇరిగేషన్‌‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పారు.  ఆదివారం గరిడేపల్లి మండలం పొనుగోడు ప్రైమరీ స్కూల్‌‌ డైమండ్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొనుగోడు స్కూల్  విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు.

స్కూల్‌‌లో అదనపు గదులు, టాయిలెట్స్, ఇతర మౌలిక వసతుల  కోసం రూ. 25 లక్షలు, గ్రామ గ్రంథాలయ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసేందుకు ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు.  అనంతరం ఆయన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌‌‌‌డీఏ పీడీ  కిరణ్ కుమార్, ఆర్డీవో జగదీశ్, జుట్టుకొండ సత్యనారాయణ, సర్పంచ్ సరోజినీ, ఎంపీటీసీ,  టీచర్లు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సర్పంచుల పెండింగ్‌‌ బిల్లులు క్లియర్ చేస్తాం

సర్పంచుల పెండింగ్‌‌ బిల్లులు క్లియర్ చేస్తామని మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామ పంచాయతీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రెండు అంగన్వాడీ  బిల్డింగులకు రూ.30 లక్షలు,  ఈద్గా పునర్నిర్మాణం , హిందూ శ్మశాన వాటికకు రూ .5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు లిప్టు కావాలని కోరగా.. ప్రపోజల్స్‌‌ సిద్ధం చేయాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

లక్కవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఉత్తమ్ సమక్షంలో పార్టీలో చేరారు. మున్నూరు కాపు సంఘం నేతలు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో లింగగిరి సర్పంచ్ కర్నాటి అంజిరెడ్డి , ఎంపీటీసీ వల్లభనేని విజయలక్ష్మి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు నిజాం, కట్టా గోపాల రావు , చల్లమల్ల రాఘవయ్య పాల్గొన్నారు.  తర్వాత మంత్రి మఠంపల్లి మండలం కృష్ణ తండాలో నిర్మించిన జీపీ కార్యాలయాన్ని  సర్పంచ్ రామారావు, నేతలు మంజి నాయక్, సాముల శివా రెడ్డితో కలిసి ప్రారంభించారు.