
- రోడ్డు కట్ట మూసివేత
- పనులు మొదలుపెట్టిన అధికారులు
- పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతే చేయాలన్న నిర్వాసితులు
కోహెడ (హుస్నాబాద్) వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో పోలీసుల బందోబస్తు మధ్య గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అధికారులు శుక్రవారం ప్రారంభించారు. గౌరవెల్లి, కుందన్ వాని పల్లి వెళ్లే రోడ్డు కట్ట మూసివేత పనులు చేయిస్తున్నారు. ఈ కట్టతోపాటు గౌరవెల్లి, గుడాటిపల్లి రోడ్డు కట్టను మూసివేస్తే ప్రాజెక్టు కట్ట పనులు పూర్తవుతాయి. అయితే గుడాటిపల్లి రహదారి కట్ట వద్ద సర్పంచ్బద్దం రాజిరెడ్డి ఆధ్వర్యంలో భూ నిర్వాసితులు దీక్ష చేస్తున్నారు. దీంతో వారు పనులు అడ్డుకుంటారనే అనుమానంతో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పనులు ప్రారంభించారు. నిర్వాసితులు మాట్లాడుతూ తమకు అందాల్సిన పరిహారం విడతల వారీగా కాకుండా పూర్తిగా చెల్లించిన తర్వాతే కట్టను మూసివేయాలని డిమాండ్‌చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఇస్తానన్న మూడు లక్షలు దశల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు తాజా మేజర్లయిన 600 మందికి రూ.6 లక్షలతో పాటు రూ.2 లక్షలు ఇస్తానన్న ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, మాట మారుస్తున్నారని ఆరోపించారు. కాగా, హుస్నాబాద్ ఆర్డీఓ ఆఫీస్‌లో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం శుక్రవారం అధికారులు చెక్కులను పంపిణీ చేశారు. పునరావాస ప్యాకేజీ కింద రూ.6 లక్షల చొప్పున 15 మందికి అందజేసినట్టు చెప్పారు.