
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆయిల్ రిటైలర్లు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను ఒకశాతం పెంచగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను స్వల్పంగా రూ. 5 తగ్గించాయి. ఏటీఎఫ్ ధరను కిలో లీటర్‌కు రూ. 777 పెంచాయి. దీనితో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ. 94,543.02కి చేరింది. ఎయిర్లైన్స్కంపెనీ నిర్వహణ ఖర్చులో దాదాపు 40 శాతం ఇంధనానికే ఖర్చవుతుంది. ఏటీఎఫ్ ధరలు స్థానిక వ్యాట్ వంటి పన్నుల ఆధారంగా ఒక్కో నగరానికి ఒక్కోలా ఉంటాయి.
హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే 19-కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 5 తగ్గించారు. ఢిల్లీలో దీని ధర రూ. 1,590.50కి చేరింది. ఇండ్లలో వాడే 14.2-కిలోల ఎల్పీజీ ధర రూ. 853 వద్ద స్థిరంగా ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలైన ఐఓసి, బీపీసిఎల్, హెచ్‌పీసిఎల్ ప్రతి నెలా ఒకటో తేదీన అంతర్జాతీయ ధరలు, విదేశీ మారకపు రేటు ఆధారంగా ఏటీఎఫ్, వంట గ్యాస్ ధరలను మార్చుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం గతేడాది మార్చి నుంచి మారడం లేదు.