జమిలిపై కమిటీ.. ఒకే దేశం ఒకే ఎన్నిక వైపు కేంద్రం అడుగులు

జమిలిపై కమిటీ..  ఒకే దేశం ఒకే ఎన్నిక వైపు కేంద్రం అడుగులు
  • మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌తో కమిటీ ఏర్పాటు 
  • ఇతర సభ్యులపై త్వరలో నోటిఫికేషన్‌‌!
  • జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న కమిటీ
  • నిపుణులు, వివిధ పార్టీలతో సంప్రదింపులు, చర్చలు జరిపే అవకాశం
  • ‘పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌‌’ను ప్రకటించిన తర్వాతి రోజే కేంద్రం కీలక నిర్ణయం
  • ‘జమిలి’ నిర్వహించాలంటే 5 రాజ్యాంగ సవరణలు చేయాలంటున్న ఎక్స్‌‌పర్ట్స్‌‌

న్యూఢిల్లీ / ముంబై / బెంగళూరు: జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం మాజీ ప్రెసిడెంట్ రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటన చేసిన తర్వాతి రోజే.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 1967లో మాదిరిగానే లోక్‌‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉన్న అవకాశాలు, అవసరమైన యంత్రాంగం తదితరాలను కోవింద్ పరిశీలిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలోని ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్‌‌ను కేంద్రం త్వరలోనే విడుదల చేయనుందని వెల్లడించాయి. జమిలి ఎన్నికలపై నిపుణులతో రామ్‌‌నాథ్‌‌ కోవింద్ మాట్లాడుతారని, వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు, చర్చలు జరుపుతారని వివరించాయి. ఈ నేపథ్యంలో రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కలిశారు. ఢిల్లీలో కోవింద్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. 

మోదీ.. 2014 నుంచి

ఒకే దేశం – ఒకే ఎన్నికపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఈ చర్చ ఎక్కువైంది. ఆయన తొలి నుంచి జమిలి ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. స్థానిక సంస్థలతో సహా వరుసగా, నిరంతరం జరిగే ఎన్నికల ప్రక్రియతో ఆర్థిక భారం పడుతుందని, పోలింగ్ సమయంలో అభివృద్ధి పనులకు అడ్డంకులు ఏర్పడుతాయని భావిస్తున్నారు. ఇప్పుడు మోదీ రెండో టర్మ్ కొన్ని నెలల్లో పూర్తికానున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలపై వేగంగా అడుగులు పడుతున్నాయి. 

ప్రస్తుతం శాసన సభలకు, పార్లమెంట్‌‌‌‌కు వేర్వేరుగా కాకుండా.. దేశవ్యాప్తంగా ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది దీని లక్ష్యం. వచ్చే సెప్టెంబర్‌‌‌‌ 18 - 22 మధ్య జరగనున్న పార్లమెంట్‌‌‌‌ ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది.

సవాళ్లు ఉన్నయ్: మాజీ సీఈసీ టీఎస్ కృష్ణమూర్తి

లోక్‌‌‌‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు అవసరమేనని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) టీఎస్ కృష్ణమూర్తి అన్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అయితే ఇదే సమయంలో ప్రాక్టికల్‌‌‌‌గా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు గురించి అడగ్గా.. ‘‘సాధ్యాసాధ్యాలను పరిశీలించడం మంచిదే” అని చెప్పారు. ‘‘జమిలి ఎన్నికలతో లాభనష్టాలున్నాయి. ప్రచారం, ఇతర అంశాలకు ఎక్కువ సమయం వృథా కాదు. ఎన్నికల వ్యయం కూడా తగ్గుతుంది. సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సరైనదే. పార్లమెంటరీ ఎన్నికలతో కలిపి రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించినప్పుడు కూడా.. ప్రజలు వేర్వేరుగా ఓట్లు వేశారు. రెండింటినీ కలిపి నిర్వహించినా.. లోక్‌‌‌‌సభకు ఒక అభ్యర్థికి, అసెంబ్లీకి మరో అభ్యర్థికి ప్రజలు ఓట్లు వేస్తారనడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయ అని వివరించారు. 

అయితే జమిలి ఎన్నికలు నిర్వహించడం అనుకున్నంత ఈజీ కాదని అన్నారు. రాజకీయ ఏకాభిప్రాయం తీసుకురా వడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ‘‘ఒక ఏడాది వ్యవధిలో జరగబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికలను ఒకసారి నిర్వహించవచ్చు. ఇలా చేయడం వల్ల కనీసం ఏడాదిలో ఎక్కువ ఎన్నికలు ఉండకుండా చూసుకోవచ్చు. జమిలి ఎన్నికలకు వెళ్లడానికి ఇది మొదటి దశ కావచ్చు” అని వివరించారు. మూడు, నాలుగు విడతలు కాకుండా.. ఒకే రోజు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ సవరణలు అవసరమని చెప్పారు.

చివరి సారిగా 1967లో..

1967 వరకు లోక్‌‌‌‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ, ఆపై కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దుకావడం, 1970లో ఏడాది ముందే లోక్‌‌‌‌సభ రద్దు కావడంతో జమిలి ఎన్నికలను కొనసాగించడం సాధ్యం కాలేదు. 1983లో ఎన్నికల కమిషన్‌‌‌‌ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదనను తెచ్చినా అది ఆచరణలోకి రాలేదు. ఈ క్రమంలో 2016లో ప్రధాని మోదీ జమిలి ఆలోచనను ప్రతిపాదించారు. 2019లో ఈ అంశంపై ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్‌‌‌‌ సహా చాలా పార్టీలు పట్టించుకోలేదు.

2018లో రామ్‌‌‌‌నాథ్ కోవింద్ ఏం చెప్పారంటే..

2018 జనవరి 29న పార్లమెంటు జాయింట్ సెషన్‌‌‌‌ను ఉద్దేశించి రామ్‌‌‌‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తరచూ జరిగే ఎన్నికల విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఇది ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. ‘‘తరచూ జరిగే ఎన్నికలు మానవ వనరులపై భారీ భారాన్ని మోపడమే కాకుండా, ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఏకకాల ఎన్నికల అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి” అని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల తర్వాత తొలి ఉమ్మడి పార్లమెంటు సెషన్‌‌‌‌లోనూ కోవింద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అత్యవసరమని, ఇది అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాలి

జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. ‘‘పార్లమెంటు సభల కాల వ్యవధికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, లోక్‌‌‌‌సభను రాష్ట్రపతి రద్దు చేయడానికి సంబంధించిన ఆర్టికల్‌‌‌‌ 85, రాష్ట్రాల శాసన సభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 172, రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు సంబంధించిన ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్ 356కి సవరణ చేయాల్సి ఉంటుంది” అని వివరించారు. భారతదేశ పాలనా వ్యవస్థలోని సమాఖ్య నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కూడా అవసరమని చెప్పారు. 

అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం పొందడం అత్యవసరమని వెల్లడించారు. ‘‘సవరణలకు లోక్‌‌‌‌సభలోని 543 స్థానాల్లో కనీసం 67 శాతం అనుకూలంగా ఓటువేయాలి. రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం సమర్థించాలి. దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లు పక్షాన నిలవాల్సి ఉంటుంది” అని చెప్పారు. ఇదే సమయంలో భారీగా అదనపు ఈవీఎంలు, పేపర్ ట్రయల్ మిషన్లు అవసరం అవుతాయని, వీటికి రూ.వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. భారీగా సిబ్బంది, భద్రతా దళాలు అవసరం అవుతాయని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌‌‌‌తో సహా వివిధ వర్గాలను సంప్రదించి, ఏకకాల ఎన్నికల అంశాన్ని పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలించిందని, కొన్ని సిఫార్సులు చేసిందని తెలిపారు. జమిలి ఎన్నికల కోసం ఆచరణాత్మకమైన రోడ్ మ్యాప్, ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ను రూపొందించడానికి తదుపరి పరిశీలన కోసం ఈ విషయాన్ని లా కమిషన్‌‌‌‌కు రిఫర్ చేశారని వెల్లడించారు. 

కమిటీ రిపోర్టును పార్లమెంటులో చర్చిస్తం

జమిలిపై కమిటీ ఇచ్చే రిపోర్టును పబ్లిక్ డొమైన్‌‌‌‌లో, పార్లమెంటులో చర్చిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌‌‌‌ జోషీ తెలిపారు. ‘‘కమిటీ ఇప్పుడే ఏర్పాటైంది.. రిపోర్టు వస్తుంది. ఆ రిపోర్టుపై పబ్లిక్‌‌‌‌ డొమైన్‌‌‌‌లో, పార్లమెంట్‌‌‌‌లో చర్చిస్తాం. విపక్షాలకు ఆందోళన ఎందుకు” అని ప్రశ్నించారు. మరోవైపు పార్లమెంటు ప్రత్యేక సెషన్‌‌‌‌లో చర్చించేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు ఎజెండాలో ఉన్నాయని ప్రహ్లాద్ జోషీ అన్నారు.  

 ప్రహ్లాద్‌‌‌‌ జోషీ

కౌంట్‌‌‌‌డౌన్ ప్రారంభమైంది

‘‘కేంద్రం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తోంది. కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసిన భారత పౌరులు ఇకపై మోసపోరు. నిరంకుశ ప్రభుత్వం దిగిపోవడానికి కౌంట్‌‌‌‌డౌన్ ప్రారంభమైంది. 140 కోట్ల మంది ప్రజలు మార్పును తేవాలని నిర్ణయించుకున్నారు. 

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే