మండుతున్న ధరలతో సామాన్యుడి విలవిల

మండుతున్న ధరలతో సామాన్యుడి విలవిల
  • భగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల రేట్లు
  • ఇల్లు ఎల్లదీయాల్నంటే సామాన్యుడికి తక్లీఫ్​
  • పది రోజుల్లోనే  డబుల్ అయిన కూరగాయల ధరలు
  • లీటర్​ నూనె‌‌‌‌ ప్యాకెట్ 200, 300 దాటిన కిలో చికెన్
  • లాండ్రీ, హెయిర్ కటింగ్ రేట్లూ పైకి..
  • అన్ని రేట్లు పెరిగాయని ఇంటి కిరాయిలు పెంచేస్తున్న ఓనర్లు

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు పెరగకున్నా ఇంటి ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి జనం విలవిలలాడుతున్నారు. పొద్దున లేవగానే తాగే పాలు, చాయ్​ దగ్గరి నుంచి కూరల్లోకి వాడే వంట నూనెలు, కూరగాయలు, చికెన్, మటన్ ధరల వరకు అన్నీ మస్తు పిరం అయ్యాయి. ఏడాది కిందటితో పోలిస్తే పల్లెల నుంచి పట్టణాల వరకు ఇంటి ఖర్చులు భారీగా పెరిగాయి. గతంలో కిరాణా సరుకులు, పాలు, కరెంట్ బిల్లులకు కలిపి నలుగురు సభ్యులున్న కుటుంబానికి రూ. 6 వేలు అయ్యే ఖర్చు ఇప్పుడు రూ. 10 వేలు దాటిపోతున్నది. ఇంటి కిరాయి కూడా కలిపితే రూ. 17 వేల నుంచి  20 వేలకు చేరుతున్నది. దీంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ తలకిందులవుతున్నది.

రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తున్నది. కిలో కొనే దగ్గర అద్ద కిలోతో సరిపెట్టుకుంటున్నారు. చికెన్ వండుకుందామంటే సామాన్యుడు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ ధర రికార్డు స్థాయిలో రూ.320 పలుకుతున్నది. నెల రోజుల కింద రూ.220 ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా వంద రూపాయలు పెరిగింది. ఆదివారం కేజీ సరిపోతుందనుకునే కుటుంబం.. ఇప్పుడు అంత ధర పెట్టి కొనలేక.. ఇటు తినకుండా ఉండలేక అర కిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నది.  మటన్ ధర కూడా కిలో రూ. 800 నుంచి వెయ్యి రూపాయలు పలుకుతున్నది. 

అన్ని పెరిగినయని ఇంటి కిరాయిలు పెంచుతున్నరు
పేద, మధ్య తరగతి ప్రజలు ఓ వైపు పెరిగిన ధరలతో సతమతమవుతుంటే.. అన్ని రేట్లు పెరిగాయంటూ ఇంటి ఓనర్లు కూడా రెంట్లు పెంచేస్తున్నారు. ముందస్తు ఒప్పందాలకు విరుద్ధంగా ఏటా రూ.500 పెంచాల్సిన చోట రూ.1,000 పెంచుతున్నారు. ఇష్టం లేకుంటే ఖాళీ చేయాలంటున్నారు. దీంతో మళ్లీ సామానంతా షిఫ్ట్ చేయడం, బయట కూడా ఇంటి కిరాయిలు ఇంచుమించు ఇట్లనే ఉండడంతో యజమానులు అడిగిన వరకు ఇచ్చి సర్దుకుపోతున్నారు. హైదరాబాద్ లో సింగిల్ బెడ్రూం  ఇల్లు కిరాయి రూ.8 వేల నుంచి 10 వేల వరకు ఉండగా.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు/ ఫ్లాట్ కిరాయి రూ.14 వేల నుంచి 20 వేల వరకు పలుకుతున్నది. 

లాండ్రీ, హెయిర్ కటింగ్ రేట్లూ పెరిగినయ్
రాష్ట్రంలో లాండ్రీ, హెయిర్ కటింగ్ రేట్లు కూడా ఇటీవల పెంచేశారు. లాండ్రీ షాపుల్లో గతంలో బొగ్గు పెట్టెలు వాడేవారు. కానీ బొగ్గు కొరత కారణంగా చాలా మంది ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్టెనే వాడుతున్నారు. ఒక డ్రెస్ ఇస్త్రీ చేస్తే రూ.20 తీసుకునేది ఇప్పుడు కరెంట్​ చార్జీలు పెరగడంతో రూ.30 తీసుకుంటున్నారు. గతంలో సాధారణ సెలూన్లలోనూ గడ్డం, కటింగ్​కు రూ.100 తీసుకునే చోట ఇప్పుడు రూ. 200 తీసుకుంటున్నారు. ఏసీ సెలూన్లలో అయితే రూ.300 నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. పెరిగిన కరెంట్ చార్జీలతో కటింగ్ రేట్లు పెంచక తప్పడం లేదంటున్నారు. 

పెరిగిన కరెంట్ బిల్లులు, పెట్రోల్​ ఖర్చులు
మెజార్టీ ఇండ్లలో టీవీ, ఫ్రిజ్, రైస్ కుక్కర్, ఫ్యాన్లు, కూలర్, వాటర్ హీటర్  నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. దీంతో కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఈ వస్తువులన్నీ వాడితే ఒక్కో కుటుంబానికి రూ.6‌‌‌‌‌‌‌‌00 నుంచి రూ.1000 వరకు కరెంట్ బిల్లు వచ్చేది. కానీ ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కరెంట్ చార్జీలను పెంచడంతో ఈ నెల బిల్లు షాకిచ్చింది. గతంలో వెయ్యి కరెంట్ బిల్లు వచ్చిన కుటుంబాలకు ఇప్పుడు రూ.1,500 వస్తున్నది. పెరిగిన కరెంట్ బిల్లులు కూడా ఇంటి బడ్జెట్‌ను పెంచేశాయి. గతంలో తమ వాహన పెట్రోల్ ఖర్చులకు నెలకు రూ.1500 ఖర్చు చేసేవాళ్లు.. ఇప్పుడు రూ.3 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. మార్కెటింగ్ ఉద్యోగాల్లో ఉండేవాళ్లకయితే పెరిగిన పెట్రోల్ రేట్లు మరింత భారంగా మారాయి. కొందరు కార్లు, టూవీలర్స్ బయటికి తీయాలంటేనే భయపడుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో బస్సు చార్జీలతోపాటు ఆటో చార్జీలు కూడా 50 శాతం మేర పెరిగాయి.

ఆగని యుద్ధం.. తగ్గని ఆయిల్ రేట్లు.. 
రాష్ట్రంలో వంట నూనెల ధరల రేట్లు తగ్గడం లేదు. ఆయిల్ రేట్లపై రష్యా ‑ ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్  ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధానికి ముందు హోల్ సేల్ షాపుల్లో బ్రాండెడ్ పల్లి నూనె లీటర్ కు రూ.135 పలకగా..  ప్రస్తుతం రూ.200కు చేరింది. రిటైల్ షాపుల్లో రూ.210 వరకు అమ్ముతున్నారు. గతంలో ఒక ఇంట్లో ఆరేడు ప్యాకెట్లు అవసరమైన నూనె వాడేవాళ్లు ఇప్పుడు నాలుగు ప్యాకెట్లతో సరిపెడుతున్నారు. మరోవైపు పామాయిల్ ధర లీటర్ గతంలో రూ.125 ఉండగా, ప్రస్తుతం రూ.145కు అమ్ముతున్నారు. నూనె రేట్లు విపరీతంగా పెరగడంతో ఇండ్లలో బ్రేక్ ఫాస్ట్ కు పూరీలు, వడల్లాంటి టిఫిన్స్ చేయాలన్నా , హాలీ డేస్  వల్ల ఇండ్లలో ఉన్న పిల్లలకు పిండి వంటలు చేసి పెట్టాలన్నా ఒకటికి, రెండు సార్లు ఆలోచిస్తున్నారు. నూనె ఎక్కువగా అవసరం లేని చిరుతిళ్లను సిద్ధం చేస్తున్నారు. సకినాలు, గారెలు, అరిసెల్లాంటి హోంఫుడ్స్ అమ్మే వాళ్లు కూడా కిలోపై రూ. 50 అదనంగా తీసుకుంటున్నారు. నూనె రేట్లు పెరగడంతో తామూ పెంచాల్సి వస్తున్నదని వాళ్లు చెప్తున్నారు.  రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్లలోనూ గతంలో ప్లేట్ టిఫిన్​ రూ.30 ఉండగా, ఇప్పుడు రూ.40, రూ.50 వరకు తీసుకుంటున్నారు. =

కిలో కొనేది.. అద్ద కిలో కొంటున్నం
రేట్లు భగ్గుమంటున్నయ్​. కిలో టమాట మొన్నటిదాకా ఇరవై ముప్పై రూపాయలుండె. ఇప్పుడు రూ. 80 అయింది. కిలో కొనాల్సిన దగ్గర అద్ద కిలో కొంటున్నం. రూ. 500 తీస్కొని మార్కెట్​కు పోతే కొనకొస్తలేదు.. మొదలుకొస్తలేదు. ఇల్లు ఎల్లదీసుడు మస్తు కష్టమైతున్నది.
‑ రాధ, రాంనగర్​, హైదరాబాద్​

పెట్రోల్​కే రూ.3 వేలు 
నేను ప్రైవేట్​ బ్యాంకులో మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్నా. లోన్స్, కొత్త అకౌంట్స్ ఓపెనింగ్ కోసం హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాలకు తిరగాల్సి ఉంటుంది. గతంలో పెట్రోల్​ కోసం నాకు రూ.1,500 నుంచి రూ.2 వేలు ఖర్చయ్యేది. పెట్రోల్ రేట్లు పెరగడంతో ఇప్పుడు రూ.3 వేలకుపైనే ఖర్చవుతోంది.
- సాతులూరి రామారావు, హైదరాబాద్

కొనుడు వశమైత లేదు
ఈ వారం కూరగాయల రేట్లు బాగా పెరిగినయి. రూ.500 నోటు పట్టుకుని మార్కెట్ కు పోతే సంచి కూడా నిండుత లేదు. టమాటా రేటు రూ.70 ఉంది. అన్ని కూరగాయల రేట్లు బాగా పిరమైనయి. చికెన్, మటన్ అయితే కొనుక్కునే వశమైత లేదు. కూలీ చేసుకుని బతికే మాలాంటోళ్లకు కుటుంబం గడవడమే కష్టంగా మారింది.
- రామసాని ఐలమ్మ, గృహణి, హన్మకొండ