ఒకే ప్లాటుకు డబుల్ ​రిజిస్ట్రేషన్లు ..  పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు

ఒకే ప్లాటుకు డబుల్ ​రిజిస్ట్రేషన్లు ..  పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు
  • పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు ముగ్గురికి అంటగడుతున్న రియల్​ బ్రోకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  వివాదాస్పద భూములు సైతం అమ్ముతున్నరు
  •  ఇబ్బందులు పడుతున్న కొనుగోలుదారులు
  • వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్ముతున్నరు

పెద్దపల్లి​, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో సామాన్యులే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రియల్​ బ్రోకర్స్​ రెచ్చిపోతున్నారు. ఒకే ప్లాటును ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్​ చేస్తూ మోసం చేస్తున్నారు. వివాదాస్పద భూములను సైతం అంటగడుతుండడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటయ్యాక భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

వ్యవసాయ భూములను వెంచర్లుగా చేసి, ఎలాంటి లేఅవుట్​ లేకపోయినా ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. ఇలా మోసపోతున్నవారిలో మొదటిసారి ప్లాట్లు కొన్నవారే ఎక్కువగా ఉంటున్నారు. ఒకే ప్లాటుకు ఇద్దరు ముగ్గురు యజమానులు ఉంటుండడంతో వివాదాలు తప్పడం లేదు. సమస్యల పరిష్కారానికి వీరంతా పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడ్తున్నారు. 

పర్మిషన్​ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు 

పెద్దపల్లి జిల్లాకేంద్రం అయ్యాక పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, గోదావరిఖని పట్టణాల్లో రియల్​ఎస్టేట్​పుంజుకొంది. ఇదే అదునుగా కొందరు రియల్టర్లు మోసాలకు తెరతీస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు, నాలా కన్వర్షన్లు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మారుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో రైల్వే ట్రాక్​ పక్కనున్న కునారం రోడ్డులోని చాలా వ్యవసాయ భూములను లే అవుట్లు వేయకుండానే ప్లాట్లుగా మార్చారు.

కలెక్టరేట్​పరిసరాల్లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చారు. గతంలో ప్రభుత్వం డీటీసీపీ  ఉన్న వెంచర్లలోని ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్​చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొంతకాలం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అయితే దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక మళ్లీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జిల్లాలో లేఅవుట్​ లేని  వ్యవసాయ భూములను కూడా రిజిస్ట్రేషన్​ చేయడంలో ఆ శాఖ అధికారులు, రియల్​బ్రోకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏజెంట్లదే కీలకపాత్ర. గతంలో ఇలా డబుల్ రిజిస్ట్రేషన్లు చేసిన కొందరు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా ఈ దందాకు తెరపడడం లేదు. 

 సింగరేణి రిటైర్డ్​ ఉద్యోగులే ఎక్కువ..

భూ బాధితుల్లో  ఎక్కువగా సింగరేణి రిటైర్డ్​ ఉద్యోగులే ఉన్నారు. సర్వీసు మొత్తం కుటుంబం కోసమే పనిచేసి  రిటైర్డ్​అయ్యాక తర్వాత వచ్చే పీఎఫ్​ డబ్బుతో పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్​ లాంటి ప్రాంతాల్లో ప్లాట్లు కొంటున్నారు. తీరా అందులో ఇల్లు కట్టుకుందామని పనులు మొదలుపెడితే ఎవరో ఒకరు వచ్చి ఈ ప్లాట్​ తమదంటున్నారు.  ఇద్దరి దగ్గర సేమ్​ సర్వే నంబర్​తో కూడిన రిజిస్ట్రేషన్​ పేపర్లు ఉండటంతో ఎవరు అసలైన యజమాని తేల్చలేకపోతున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే వారు కోర్టుకు వెళ్లమంటున్నారు. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ప్లాటు లిటిగేషన్​లో పడిపోవడంతో బాధితులు దిక్కు తోచని స్థితిలో పడిపోతున్నారు.  

అవగాహన కల్పించేవారే లేరు 

ప్లాట్ల వ్యవహారం మీద అవగాహన లేకపోవడంతోనే కొనుగోలుదారులు మోసపోతున్నారు.  ప్లాటు అమ్మకందారునికి, కొనుగోలుదారునికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండడం లేదు. ఇద్దరి మధ్య రియల్టర్ అనే మధ్యవర్తి కీలకమవుతున్నాడు. వారి మధ్య వ్యవహారం నడిపి కమీషన్ తీసుకొని జారుకుంటున్నాడు. ఆ తర్వాత వచ్చే సమస్యలతో తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నాడు. రిజిస్ట్రారు కూడా ఇద్దరికి సంబంధించి లావాదేవీలు పూర్తయ్యాయా అనే ప్రశ్నించి రిజిస్ట్రేషన్​చేస్తున్నారు తప్ప.. ఆ ప్లాటుకు పూర్వపరాలను పరిశీలించడం లేదు. కొనుగోలుదారులు ఒక ప్లాటు కొనేముందు క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందో లేదో తెలుసుకునేలా వెసులుబాటు ఉండడం లేదు. ప్లాటు కొనేముందే దానికి సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించాలి.

పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్​ కాలనీకి చెందిన పంజాల సుమన్​ సింగరేణి కార్మికుడి కొడుకు, ఆయన తండ్రి రిటైర్​ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి రోడ్​ రంగంపల్లిలోని తన సమీప బంధువు ప్లాటును కొని రిజిస్ట్రేషన్​చేయించుకున్నాడు.  ఇల్లు కట్టుకుందామని బోరు వేయించాక ఆ ప్లాటు తనదే అని మరో వ్యక్తి వచ్చాడు. ఇద్దరు పోలీసులను ఆశ్రయించడంతో.. కోర్టుకు వెళ్లమని వారు సలహాఇచ్చారు. రెండేళ్లయినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. 

జిల్లా కేంద్రంలోని రంగంపల్లి  రాజీవ్​ రహదారిని ఆనుకొని ఉన్న ఓ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   తిర్రి తిరుపతి 15.5 గుంటలు కొనుగోలు చేశాడు. అదే బిట్టులో మరో ఇద్దరు 10 గుంటలు కొనుగోలు చేశారు. ఎవరికి వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.  కానీ హద్దుల విషయంలో భూమి మాదంటే మాదని  వాదనకు దిగారు. దీంతో సమస్య తీవ్రమైంది. ఎవరూ అమ్ముకోలేక, కొనేవారు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే రంగంపల్లిలో కిషన్​, సత్యనారాయణ భూమి మాదంటే మాదని గొడవపడగా వారికి సంబంధించిన మహిళలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు.