ఆధార్​ అప్​డేట్​కు తిప్పలు .. పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్న రేషన్​ కార్డుదారులు

ఆధార్​ అప్​డేట్​కు తిప్పలు .. పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్న రేషన్​ కార్డుదారులు

నాగర్ కర్నూల్, వెలుగు:  రేషన్ కార్డ్​ను ఆధార్​ కార్డ్​తో లింక్​ చేయాలన్న ఆదేశాలతో ​సామాన్యులు తిప్పలు పడుతున్నారు. గడువు దాటితే బియ్యం రావనే భయంతో మీసేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ముందు లైన్లు కడుతున్నారు. దసరా సెలవులకు వచ్చిన పిల్లల పేర్లు, వివరాలు రేషన్​కార్డులో నమోదు చేయించేందుకు పేరెంట్స్​ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నాగర్​కర్నూల్​ జిల్లాలోని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని మీసేవా సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. మీసేవా సెంటర్లు లేని మండలాల నుంచి నాగర్​ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్​కు  వెళ్తున్నారు.

ఎందుకీ కొత్త విధానం..

రాష్ట్ర ప్రభుత్వం ఆరేండ్లుగా కొత్త రేషన్​కార్డులు ఇవ్వడం లేదు. ఆయా కుటుంబాల్లో పుట్టిన వారి పేర్లను రేషన్​ కార్డుల్లో చేర్చేందుకు అనుమతించలేదు. కొత్తగా పెళ్లి చేసుకొని కాపురం పెట్టిన వారికి కూడా రేషన్​ కార్డు లేకుండా పోయింది. భార్యా భర్తలుగా మారినా వారి పేర్లు మాత్రం ఇప్పటికీ ఎవరింట్లో వారివన్నట్లుగానే నడుస్తోంది. ఆయా కుటుంబాల్లో చనిపోయినవారి పేర్లను తొలగించక పోవడంతో వారి పేరిట బియ్యం ఇస్తున్నారు.

పుట్టిన వారి పేర్లను చేర్చకపోవడంతో వారికి బియ్యం రావడం లేదు. ఎన్నికల ముందు సర్కార్​ ప్రకటించిన పలు స్కీమ్ లకు తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధన​ పెట్టారు. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్నా, రేషన్​కార్డు లేని కారణంగా దళితబంధు, గృహలక్ష్మి, బీసీ రుణాలు  పొందలేక పోతున్నారు. ఇలా గ్రామాల్లో వందలాది మంది ఉన్నారు. బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాల్లో ఆధార్  లింక్  చేయకపోవడంతో నాగర్ కర్నూల్ కు వస్తున్నారు. అచ్చంపేటలో ఈ కేవైసీ చేయించుకోవాలనే విషయంపై ప్రచారం చేయకపోవడంతో లబ్ధిదారులు పట్టించుకోవడం లేదు. అమ్రాబాద్, పదర, లింగాల మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బియ్యం లేకున్నా ఈ కేవైసీ చేసేందుకు రేషన్​షాపులు తెరుస్తున్నామని రేషన్ డీలర్లు చెబుతున్నారు. 

లబ్ధిదారుల్లో ఆందోళన..

రేషన్​ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులు ఆధార్​తో లింక్​ చేయకపోతే  రేషన్​ బియ్యం రావనే ప్రచారం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వ గైడ్​లైన్స్​ ప్రకారం రేషన్​కార్డులో చనిపోయిన వారి పేర్లను తొలగించి, కొత్తగా పుట్టిన వారి పేర్లను నమోదు చేసే ప్రక్రియను అక్టోబర్​ 1 నుంచి స్టార్ట్​ చేశారు. రేషన్​ షాపుల్లో ఈకేవైసీ ద్వారా కుటుంబంలోని కొత్త సభ్యులను చేర్చుతున్నారు. వేలిముద్ర, ఐరిష్​ ద్వారా నమోదు చేస్తున్నారు. రేషన్​ షాపుల్లో ఈ రెండు నమోదు కాని పక్షంలో మీసేవా సెంటర్లు, పోస్టాఫీసుల్లో రేషన్​కార్డుకు ఆధార్​ లింక్​ చేయించుకొని రావాలని డీలర్లు సూచిస్తున్నారు.