వనపర్తిలో ఆగని ఇసుక దందా .. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు

వనపర్తిలో ఆగని ఇసుక దందా .. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు
  • ఊకచెట్టి వాగు పరిసరాల్లో భారీగా ఇసుక డంప్​ల సీజ్
  • పోలీసులు, రెవెన్యూ అధికారుల అండతో పెట్రేగుతున్న అక్రమార్కులు
  • సీఎం పేషీకి నేరుగా ఫిర్యాదు చేస్తున్న బాధిత గ్రామాల ప్రజలు

వనపర్తి, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఇసుకను  తరలించడంతో సామాన్యులు ఇబ్బందిపడ్డారు. విషయాన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వాగుల్లో అక్రమ రవాణాను అడ్డుకొని, సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వనపర్తి జిల్లాలోని పలు వాగుల్లో ఇప్పటికీ అర్ధరాత్రి వేళల్లో అక్రమార్కులు ఇసుక తరలిస్తున్నారు. ఇసుక పాలసీని బేఖాతరు చేస్తూ ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా పోలీసులు, తహసీల్దార్ల  సహకారంతో వాగులను తోడేస్తున్నారు. దీనిపై ఇక్కడి ప్రజలు ఏకంగా సీఎం పేషీకి ఫిర్యాదు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దాడులు చేసి రెండు రోజుల్లో 3,824 ట్రాక్టర్ల ఇసుక డంప్ లను సీజ్  చేశారు. అయితే సంబంధిత అధికారులు అక్రమార్కులను తప్పించే ప్రయత్నం చేయడం అనుమానాలకు తావిస్తోంది.

ఆఫీసర్ల అండతోనే..

జిల్లాలోని పెద్దమందడి, ఖిల్లా ఘణపురం, పెబ్బేరు, ఆత్మకూరు, రేవల్లి, గోపాల్ పేట, కొత్తకోట మండలాల్లో వాగులు ఖాళీ అవుతున్నాయి. పెద్దమందడి మండలం చిల్కటోనిపల్లి వాగు, వెల్టూరు చెరువు నుంచి రాత్రిపూట  జోరుగా అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది. స్థానిక ట్రాక్టర్  ఓనర్లు వెల్టూరు, చిలుకటోనిపల్లి  గ్రామాల్లో ఇసుకను డంప్​ చేసి హైదరాబాద్ కు లారీల్లో తరలిస్తున్నారు. గతంలో ట్రాక్టర్  ఇసుక రూ.4 వేలకు దొరికేది. ఇప్పుడు రూ.6 వేలకు పెంచి దోచుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర ప్రాంతాలకు  ఇసుక తరలిస్తూ స్థానిక అవసరాలకు లేకుండా చేస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వాగుల్లో ఇసుక తరలించే అక్రమార్కులు ప్రతి వారం మామూళ్లు ఇస్తూ దందా కొనసాగిస్తున్నారని బహిరంగంగా చెబుతున్నారు. ప్రభుత్వం ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినా, లంచాలకు అలవాటు పడిన అధికారులు మాత్రం మారడం లేదని అంటున్నారు. రాత్రిపూట పంట పొలాల మీదుగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారని, దీంతో తమ భూములు పాడైపోతున్నాయని చిలకటోనిపల్లి, వెల్టూరు, పెబ్బేరు ప్రాంతాల రైతులు వాపోతున్నారు.

అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. కొన్నిచోట్ల పోలీస్  కానిస్టేబుళ్లు దగ్గరుండి ట్రాక్టర్లను నడిపిస్తున్నారని పెద్దమందడి రైతులు ఫిర్యాదు చేశారు. కొందరు లీడర్లు ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్, రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.

పెబ్బేరు మండలంలో వాగులు ఖాళీ.. 

జిల్లాలోని  పెబ్బేరు మండలం రాంపూర్  గ్రామంలో ఇసుక అక్రమ రవాణాపై జనం ఆందోళన చేపట్టడంతో జిల్లా అధికారులు రెండు రోజుల వ్యవధిలో 3,824 ట్రాక్టర్ల ఇసుక డంప్ లను సీజ్  చేశారు. ఊకచెట్టి వాగును పూర్తిగా ఖాళీ చేసి ఒడ్డున పోశారు. ఇటాచీ, జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో వాగులోని ఇసుకను తోడి హైదరాబాద్ కు తరలించేందుకు సిద్ధం చేశారు. జిల్లా అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడంతో ఆర్డీవో ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్  దాడి చేసింది. గురువారం 32 వేల ట్రాక్టర్ల ఇసుక నిలువలను సీజ్  చేశారు. శుక్రవారం 624 ట్రాక్టర్ల ఇసుక డంప్​లను సీజ్​ చేశారు. నిబంధనలు అతిక్రమించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా ఇన్నాళ్లు అధికారులు పట్టించుకోలేదు. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజలు నేరుగా సీఎం పేషీకి ఫిర్యాదు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారీగా ఇసుక నిల్వలు సీజ్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఇందుకు కారకులైన వారిని మాత్రం తప్పించారనే ఆరోపణలున్నాయి. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్  చేస్తున్నారు.

సమాచారం ఇస్తే దాడులు చేస్తాం..

జిల్లాలోని వాగుల నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలించి నిల్వ చేసే వారి సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. ఇసుక పాలసీని కాదని నాణ్యత లేని ఇసుకను ప్రజలకు అంటగడితే చర్యలు తీసుకుంటాం. వాగుల్లో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకుంటాం.

 పద్మావతి, ఆర్డీవో, వనపర్తి