ఏంటీ.. బొద్దింకలు ఉన్నాయని రైలు ఆపేస్తారా..

ఏంటీ.. బొద్దింకలు ఉన్నాయని రైలు ఆపేస్తారా..

ఒక రైలు ప్రయాణంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఆగస్టు 5న పూణే స్టేషన్‌కు చేరుకున్న ఓ రైలు.. ఓ అసాధారణమైన కారణంతో ఆగిపోయింది. అందుకు కారణం కోచ్‌లోని ప్రయాణీకులు బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదు చేయడమేనట.

రైల్వే అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, పన్వెల్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కోచ్ B-1 కోచ్‌లో బొద్దింకలు గురించి చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని లాతూర్ డిపోకు చెందిన దత్తా గైక్వాడ్ ఆన్‌బోర్డ్ టిక్కెట్ చెకింగ్ సిబ్బంది నివేదించారు. వెంటనే రైలు రాకపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు పుణెలోని మెకానికల్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. కాగా ఈ రైలు ఆ సాయంత్రం పూణే స్టేషన్ చేరుకుంది.

ఈ వెంటనే సీనియర్ సెక్షన్ ఇంజనీర్/క్యారేజ్ & వ్యాగన్, క్లీనింగ్ సిబ్బంది కోచ్ వద్దకు వచ్చారు. సత్వర ఉపశమనం కోసం హిట్ స్ప్రేని పిచికారీ చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే, కొంతమంది ప్రయాణికులు ఈ తక్షణ పరిష్కారాన్ని ఒప్పుకోలేదు. బదులుగా కోచ్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) సిబ్బందితో సహా రైల్వే సిబ్బంది హిట్ స్ప్రే ట్రీట్‌మెంట్‌ను అంగీకరించమని ప్రయాణికులను ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు మాత్రం నిరాకరిస్తూనే ఉన్నారు. పరిస్థితిని బట్టి కోచ్‌ని మార్చడం అసాధ్యమని చెప్పినా వినకపోవడంతో రైల్వే అధికారులు ప్రయాణికులతో చర్చలు జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యను సమగ్రంగా పరిష్కరించడానికి, బొద్దింకల నివారణ చర్యలను నిర్వహించడానికి కుర్దువాడి స్టేషన్ వరకు రైలుతో పాటు ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ఇద్దరు క్లీనింగ్ సిబ్బందితో సహా నలుగురు సిబ్బందిని నియమించారు.

అధికారులు ఎట్టకేలకు ప్రయాణీకులను ఒప్పించడంతో .. గంట తర్వాత అంటే రాత్రి 8.42 గంటలకు రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ, అధికారులను కోరింది.