రోడ్డు పూర్తికాకుండానే టోల్​ట్యాక్స్!

రోడ్డు పూర్తికాకుండానే టోల్​ట్యాక్స్!

రోడ్డు పూర్తికాకుండానే టోల్​ట్యాక్స్!

మందమర్రిలో ప్రయాణికుల ఆందోళన

మందమర్రి, వెలుగు : రోడ్డు పనులు పూర్తి చేయకుండానే టోల్​ట్యాక్స్​వసూలు చేయడంపై ప్రయాణికులు, స్థానికులు, లీడర్లు ఆందోళనకు దిగారు. మంచిర్యాల – -చాందా రోడ్డును నాలుగు వరుసలుగా మార్చుతూ 2018లో రూ.2,407 కోట్లు కేటాయించారు. 2019 టెండర్లు పూర్తికాగా 2020 ఆగస్టులో పనులు మొదలుపెట్టారు. మంచిర్యాల జిల్లాలోని ఇందారం క్రాస్​ రోడ్​ నుంచి తాండూరు మండలం రేపల్లెవాడ వరకు రూ.1,356.90 కోట్ల వ్యయంతో 42 కి.మీ. పనులు చేయాల్సి ఉంది. రోడ్డు, ఫ్లైఓవర్ల  పనుల కోసం తరచూ దారిని వన్​వేగా మార్చడంతో మందమర్రి బస్టాండు, సోమగూడెం, తాండూర్​ మండల కేంద్రం దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రమాదాల్లో పది మందికి పైగా చనిపోయారు. 

రోడ్డు పనులు పూర్తి కాకుండానే శుక్రవారం ఉదయం మందమర్రి పట్టణ శివారు కేకే ఓసీపీ సమీపంలో టోల్​ప్లాజాను కలెక్టర్​ భారతిహోళికేరి ప్రారంభించారు. రోడ్డు పనులు పూర్తికాకుండానే టోల్​ ట్యాక్స్​వసూలు చేయవద్దని ప్రయాణికులు, స్థానికులు, సింగరేణి కార్మికులు  ఈ సందర్భంగా కలెక్టర్​ను కోరారు. అయితే రూల్​ప్రకారం పూర్తయిన రోడ్డు ఆధారంగా టోల్​ట్యాక్స్​ వసూలు చేస్తున్నట్లు హైవే ఆఫీసర్లు చెప్పారు. రోడ్డు కోసం తమ భూములు కోల్పోయామని, టోల్​ప్లాజాలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కాసీపేట మండల సోమగూడెం సర్పంచ్​ప్రమీలాగౌడ్​ నేతృత్వంలో స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డు పనులు పూర్తికాకుండా టోల్​ పన్ను వసూలు చేయవద్దని, 20 కి.మీ.లోపు స్థానికులకు ఉచిత పాసులు ఇవ్వాలని, టోల్​ ప్లాజాలో ఉద్యోగాలు కల్పించాలని సీపీఐ జిల్లా సెక్రటరీ, మందమర్రి టౌన్​కామెర దుర్గారాజు, మంచిర్యాల జిల్లా బీఎస్పీ ఇన్​చార్జీ ఎం.వి.గుణ, జోనల్ మహిళా కన్వీనర్ భవానీ, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద నేతృత్వంలో సీపీఐ, బీఎస్పీ లీడర్లు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్​జామైంది. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను పంపించివేశారు. 

బస్సు ప్రయాణికుల నుంచీ వసూలు

టోల్ ట్యాక్స్ పేరుతో మంచిర్యాల బెల్లంపల్లి మధ్య నడిచే ప్రతి ఆర్టీసీ బస్సులోని ప్రయాణికుల నుంచి టికెట్​పై ఉన్న రేటుకంటే రూ. 10 అదనంగా తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు టోల్ ప్లాజా నిర్వాహకులతోపాటు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తో గొడవపడ్డారు. పాస్ కలిగిన ప్రయాణికులు, స్టూడెంట్ల నుంచి సైతం వసూలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.