
- మెజారిటీ కంపెనీల చూపు నగరంవైపే
- ఆకర్షిస్తున్న ఇన్‌ఫ్రా, ట్యాలెంట్‌పూల్
- జీతాలు తక్కువ ఉండటం మరో కారణం
న్యూఢిల్లీ: మనదేశంలోని మిగతా నగరాలకంటే బిజినెస్‌ను పెంచుకోవడానికి, కొత్త కంపెనీలను ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్ అత్యుత్తమమైనదని అత్యధిక కంపెనీలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లో అన్ని రకాల మౌలిక వసతులు ఉండటం, రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, అన్ని రకాల సంస్కృతుల వాళ్లు ఉండటం, తక్కువ జీతాలకు ప్రతిభావంతులైన నిపుణులు దొరకడం వంటివి వాణిజ్యవేత్తలను ఆకర్షిస్తున్నాయని తాజాగా నిర్వహించిన ఒక స్టడీలో వెల్లడయింది. సర్వేల్లో పాల్గొన్న బిజినెస్ హెడ్‌లలో 41 శాతం మంది హైదరాబాద్‌కే ఓటేశారని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (హైసియా), కన్సల్టింగ్ కంపెనీ కేపీఎంజీ ఉమ్మడిగా నిర్వహించిన స్టడీలో వెల్లడయింది. నగరంలో గురువారం నిర్వహించిన హైసియా 27వ యాన్యువల్ ఇన్నోవేషన్ సమిట్‌లో ఈ సర్వే నివేదికను విడుదల చేశారు. ఇందులోని వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తగినంత ప్రగతి సాధ్యమవుతుందని నమ్ముతున్నట్టు 97 మంది సర్వే రెస్పాండెంట్లు చెప్పారు. ఇక్కడ వసతులు తాము కోరుకున్నవాటికంటే ఎక్కువే ఉన్నాయని రెస్పాండెంట్లలో మూడింట ఒకవంతు మంది అన్నారు.సుస్థిర ప్రభుత్వం ఉండటంపై 98 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర ఇండియన్ సిటీలతో పోలిస్తే ఇక్కడ ఉద్యోగుల రాజీనామాలు తక్కువ ఉన్నాయని 74 శాతం మంది హర్షం వ్యక్తం చేశారు. కొత్త వస్తువులను, సేవలను కనుగొనడంలో హైదరాబాద్ ముందువరుసలో ఉందని 93 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. ‘‘అన్ని రకాల విద్యార్హతలు, తగినన్ని నైపుణ్యాలు ఉన్నవారికి హైదరాబాద్‌లో కొదవ లేదని 87శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో 13 శాతం మంది అసంతృప్తిని ప్రకటించారు. బిజినెస్ ప్లాన్స్ విషయంలో నగరం భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉందని దాదాపు అందరూ అంగీకరించారు’’ అని కేపీఎంజీ రిపోర్టు వివరించింది.
హైదరాబాద్‌వైపే నిపుణుల గురి
దేశవ్యాప్తంగా మెట్రో నగరాలకు వస్తున్న వలసల్లో హైదరాబాద్ వాటా 8.44 శాతమని ఈ రిపోర్టు తెలిపింది. ప్రతిభావంతులను ఆకర్షించడంలో భాగ్యనగరం టాప్–3లో ఉంది. ‘‘వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలనుకునేవారికి, కొత్తగా ఇక్కడ బిజినెస్ చేయాలనుకునేవారికీ హైదరాబాద్ ఇష్టమైన నగరంగా మారుతున్నది. ఎందుకంటే ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ జీతాలు పదిశాతం తక్కువ. నాన్–టెక్ ఉద్యోగాల్లో అయితే 20 శాతం వరకు తక్కువ జీతాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌లో 5.50 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో వీరి సంఖ్య 14.3 శాతం పెరిగింది’’ అని నివేదిక విశ్లేషించింది. గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్ నుంచి ఐటీ ఎగమతులు 16.89 శాతం పెరిగాయి. జాతీయ సగటుతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. డిమాండ్‌ను తట్టుకోవాలంటే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ రాబోయే మూడేళ్లలో 13.84 శాతం పెరుగుతుంది. 2021 నాటికి ఇది తొమ్మిది కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని కేపీఎంజీ సర్వే రిపోర్ట్ వివరించింది.