ఉద్యోగుల ఆరోగ్యంపై కంపెనీల స్పెషల్​ ఫోకస్​...

ఉద్యోగుల ఆరోగ్యంపై  కంపెనీల స్పెషల్​ ఫోకస్​...

వెలుగు బిజినెస్​ డెస్క్​ : కరోనా మహమ్మారి ఎఫెక్ట్​ తర్వాత ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక ఫోకస్​ పెడుతున్నాయి మన దేశంలోని కంపెనీలు. శారీరకంగా, మానసికంగా ఉద్యోగులు దృఢంగా ఉండేందుకు చొరవ తీసుకుంటున్నాయి. ఇందుకోసం తమ బడ్జెట్​లను కూడా భారీగా పెంచుతున్నాయి. కరోనా మహమ్మారి ఎఫెక్ట్​తో మన దేశంలోనూ వర్క్​ కల్చర్​ మారిపోయింది. ఇంటి నుంచి పనిచేయడం లేదా రిమోట్​గా పనిచేయడం, ఆఫీసులకు వెళ్లేందుకు పట్టే సమయం ఎక్కువవడం, జీవన ఖర్చు పెరగడంతోపాటు కొవిడ్​19 సంబంధ ఆరోగ్య సమస్యలతోనూ చాలా మంది ఇబ్బందులెదుర్కొంటున్నారు. 

కరోనా ఎఫెక్ట్​ ఇంకా పోలేదు....

కరోనా చాలా మంది ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్​ చూపింది. ఈ ఎఫెక్ట్​ ఇప్పట్లో కనుమరుగయ్యే అవకాశాలు కూడా కనబడటం లేదు. దీంతో ఉద్యోగుల బాగోగులు కంపెనీలకు చాలా ఇంపార్టెంట్​గా మారాయి. అన్ని రంగాలలోని కంపెనీలు తమ ఉద్యోగుల మంచి, చెడ్డలపై దృష్టి పెట్టడం విశేషం. వారంలో కొన్ని రోజులైనా ఉద్యోగులు ఇప్పుడు ఆఫీసులకు వచ్చే పనిచేస్తున్నారు. 

ఉద్యోగులకు ఫైనాన్షియల్​ సపోర్ట్...

ఉద్యోగులు మానసికంగానూ ఆరోగ్యంగా ఉండేందుకు 70 శాతానికి పైగా  కంపెనీలు ఫైనాన్షియల్​ సపోర్ట్​ను పెంచాయి. స్ట్రెస్​ మేనేజ్​మెంట్​ ప్రోగ్రామ్స్​, ఇన్సూరెన్స్​, పెయిడ్​ టైమ్​ ఆఫ్, హోమ్​ రిలొకేషన్​ సాయం వంటి బెనిఫిట్స్​ఇ స్తున్నట్లు హెచ్​ఆర్​ సొల్యూషన్స్​ కంపెనీ యోన్​ డేటా వెల్లడిస్తోంది. 40 రంగాలలోని 1,300 కంపెనీల ఆగస్టు డేటా ఇందులో పొందుపరిచారు. ఆర్​పీజీ గ్రూప్, ఐబీఎం ఇండియా, ఐసీఐసీఐ లాంబార్డ్​, మైక్రోసాఫ్ట్​, పీడబ్ల్యూసీ ఇండియా, కోల్గేట్​ పామోలివ్​ (ఇండియా), లోరీల్​ ఇండియా, పేయు, ఫై మనీ వంటి కంపెనీలన్నీ ఉద్యోగుల బాగోగులపై ప్రత్యేక ఫోకస్​ పెడుతున్నాయి.

క్రెష్​, డేకేర్​ సపోర్ట్​ కూడా...

ఆఫీసులకు ఉద్యోగులు తిరిగి రావడంలో ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు పరష్కారానికి కంపెనీలు సాయం అందిస్తున్నాయి. క్రెష్​, డే కేర్​ ఏర్పాటు వంటి వాటిని సొంతంగా  ఏర్పాటు చేయడమో లేదా ఆ సదుపాయాలు అందించే టై అప్​ పెట్టుకోవడమో కార్పొరేట్​ కంపెనీలు చేస్తున్నాయి. అంతేకాదు, తమ పిల్లల కోసం ఉద్యోగులు  క్రెష్​, డే కేర్ వంటి వాటిపై వెచ్చించే మొత్తాన్ని రీయంబర్స్​ కూడా చేస్తున్నాయి. ఇలాంటి కార్యకలాపాలపై దాదాపు ​   69 శాతం కంపెనీలు చొరవ తీసుకుంటున్నాయి. మెంటల్​ వెల్​నెస్​ కంపెనీ జునో క్లినిక్​లో ఆర్​పీజీ గ్రూప్​ పెట్టుబడులు పెట్టింది. ఈ క్లినిక్​లలోని నిపుణుల వద్దకు ఆర్​పీజీ గ్రూప్​ఉద్యోగులు –వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఖర్చూ లేకుండానే వెళ్లొచ్చు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, బాగోగులపై ఆర్​పీజీ గ్రూప్​ ఫోకస్​ పెడుతోందని, వాటిపై సీరియస్​గా దృష్టి పెడుతున్నామని  ప్రెసిడెంట్​ (గ్రూప్​ హెచ్​ఆర్) ఎస్​. వెంకటేష్​ చెప్పారు. ఇలాంటి వాటి కోసం గ్లోబల్​గా ఉన బెస్ట్ ప్రాక్టీసెస్​ను అమలు చేసే విషయంలో సీనియర్​ లీడర్​షిప్​ వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక పీడబ్ల్యూసీనైతే ఉద్యోగుల బాగోగుల కోసం ఒక పోర్టల్​నే ఏర్పాటు చేసింది. అంతేకాదు, హెల్త్​, ఇన్సూరెన్స్​ సదుపాయాలనూ భారీగా పెంచింది. ఉద్యోగుల భౌతిక, మానసిక​ అవసరాలపై ఫోకస్​ పెడుతున్నట్లు తెలిపింది.

మెంటల్​ హెల్త్​ కోసమూ సిక్​ లీవులు..

తన సిక్​ లీవ్​ పాలసీలో మెంటల్​ హెల్త్​ను కూడా మైక్రోసాఫ్ట్​ చేర్చింది. ఇందుకోసం సిక్​ అండ్​ మెంటల్​ హెల్త్ లీవ్‌‌గా దాని పేరును కూడా మార్చేసింది. ఇక ఫిన్​టెక్​ రంగంలోని ఫై మనీ ఉద్యోగుల బాగోగుల కోసం అన్​లిమిటెడ్​ లీవులతో పాలసీ తీసుకొచ్చింది. ఇందులో మెంటల్​ హెల్త్​ కూడా భాగమే. ఉద్యోగులకు ఆటో అప్రూవల్​తో లీవులు తీసుకునే సదుపాయాన్ని ఈ కంపెనీ అందిస్తోంది. తమ ఉద్యోగులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఈ కంపెనీ పీపుల్​ హెడ్​ పూర్ణిమా కామత్​ చెప్పారు. ఏ కారణం కోసమైనా ఉద్యోగులు సెలవు తీసుకోవాలనుకుంటే, అందుకు వారికి పూర్తి వెసులుబాటు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరో ఫిన్​టెక్​ కంపెనీ పేయు ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం 10 రోజుల ప్రత్యే క లీవ్​ ప్రోగ్రామ్​ను తెచ్చింది. వర్క్​–లైఫ్​ బాలెన్స్​ కోసమే ఈ చొరవ తీసుకుంటున్నట్లు చీఫ్​ పీపుల్​ ఆఫీసర్​ ప్రియా ఛెరియన్​ చెప్పారు. ఫ్లెక్సిబుల్​ వర్కింగ్​ పాలసీ తెచ్చామని, 40 ఎర్న్​డ్​ లీవులు లభిస్తాయన్నారు.