కంపెనీలు ఇన్నోవేషన్ తోనే గెలుస్తయ్ ...ఆశ్రిత పక్షపాతంతో కాదన్న రాహుల్ గాంధీ

కంపెనీలు ఇన్నోవేషన్ తోనే గెలుస్తయ్ ...ఆశ్రిత పక్షపాతంతో కాదన్న రాహుల్ గాంధీ
  • మూడు నాలుగు కంపెనీల చేతుల్లోనే ఇండియా ఎకానమీ  
  • కొలంబియాలో ఎంపీ కామెంట్లు 

బొగోటా (కొలంబియా): ఇండియన్ కంపెనీలు వాహనాల తయారీలో ఇన్నోవేషన్ ల ద్వారానే విజయం సాధిస్తాయని, ఆశ్రిత పక్షపాతంతో కాదని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సౌత్ అమెరికాలోని నాలుగు దేశాల టూర్ లో భాగంగా కొలంబియాలో పర్యటిస్తున్న ఆయన ఆయన బజాజ్ పల్సర్ మోటార్ బైకు ముందు నిలబడి ఉన్న ఫొటోను శుక్రవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘కొలంబియాలో బజాజ్, హీరో, టీవీఎస్ కంపెనీలను చూడటం గర్వంగా భావిస్తున్నా. ఇండియన్ కంపెనీలు ఇన్నోవేషన్ తోనే గెలుస్తాయి, తప్ప ఆశ్రిత పక్షపాతంతో కాదని ఇవి నిరూపిస్తున్నాయి” అని పేర్కొన్నారు. 

మెడెల్లిన్ సిటీలోని ఈఐఏ యూనివర్సిటీలో ‘ద ఫ్యూచర్ ఈజ్ టుడే’ పేరుతో నిర్వహించిన సెమినార్ లోనూ రాహుల్ మాట్లాడారు. ఇండియా ఎకానమీ మూడ్నాలుగు కంపెనీల గుత్తాధిపత్యంలోనే ఉందని విమర్శించారు. పొరుగున ఉన్న చైనా, దాని బలాలతో పోలిస్తే ఇండియాలో చాలా సంక్లిష్టమైన వ్యవస్థ ఉందన్నారు. ‘‘ఇండియా విషయంలో నేను ఆశావాదంతో ఉన్నా. కానీ దేశ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. అధిగమించాల్సిన రిస్క్​లు ఉన్నాయి. వీటిలో ప్రజాస్వామ్యం మీద దాడి అనేది అతిపెద్ద ప్రమాదం.

 ఇప్పుడు ఇండియాలో ఇదే కొనసాగుతోంది” అని రాహుల్ చెప్పారు. ‘‘ఇండియాలో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయి, అన్నింటికీ సమాన స్థానం దక్కాలి” అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఒక మోటార్ బైకు 100 కిలోల మెటల్ మాత్రమే ఉంటే.. కారు 3 వేల కిలోల మెటల్​తో ఎందుకుంటుందో తెలుసా?’ అని ఈ సెమినార్​లో విద్యార్థులను రాహుల్ ప్రశ్నించారు.

 ‘‘యాక్సిడెంట్ జరిగితే కారు ఇంజన్ లోపలికి ఊడిపోయి వచ్చి అందులోని వారిని చంపేస్తుంది. మోటారుబైకు ఇంజన్ మాత్రం విడిపోయి దూరంగా పడుతుంది. అందుకే కారు ఇంజన్ ప్రయాణికులను చంపకుండా ఉండేలా వెహికల్​ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో మెరుగైన డిజన్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారవుతున్నాయి” అని ఆయన వివరించారు. కాగా, కార్లు, మోటార్ బైకుల డిజైన్లపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లు అర్థరహితంగా ఉన్నాయంటూ ఆయన వీడియో క్లిప్​ను బీజేపీ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో షేర్ చేశారు.