
ఖమ్మం/ కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో మార్చి నెలలో కురిసిన వడగండ్ల కారణంగా జరిగిన పంట నష్టం అంచనాలు లెక్క తప్పాయి. ప్రాథమిక అంచనాతో పోలిస్తే ఫైనల్ రిపోర్టులో లెక్కలు తారుమారయ్యాయి. నష్టం జరిగిన పంటల విస్తీర్ణాన్ని, రైతుల లెక్కను అగ్రికల్చర్ ఆఫీసర్లు అమాంతం తగ్గించేశారు. 2.28 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని తొలుత అంచనా వేసి.. ఇప్పుడు ఆ లెక్కను 1.51 లక్షలకు కుదించారు. దీంతో బాధిత రైతుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. మొత్తం పంటలో కనీసం 33 శాతం క్రాప్ లాస్ ఉండాలనే రూల్, కొన్ని చోట్ల జరిగిన నష్టాన్ని ఆఫీసర్లు నష్టంగా చూడకపోవడంతోనే పంట నష్టం విస్తీర్ణం తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆరే స్వయంగా మార్చి 23న పంట నష్టం జరిగిన ఖమ్మం, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి.. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని భరోసా ఇస్తే.. ఆఫీసర్లు మాత్రం లెక్క తగ్గించి పంపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గంటల్లోనే పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి నెల రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు పరిహారం పైసలు అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2.28 లక్షల నుంచి 1.51 లక్షల ఎకరాలకు తగ్గింపు..
ప్రభుత్వ నిబంధనల కారణంగా నష్టపోయిన రైతుల సంఖ్య, పంట మొత్తం ప్రాథమిక అంచనా కంటే గణనీయంగా తగ్గింది. ప్రాథమిక అంచనాలో 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలు అన్నీ కలిపి 17,238 ఎకరాలున్నాయి. కానీ కనీసం ఎకరంలో 33 శాతం పంట నష్టపోయిన వారి వివరాలనే నమోదు చేయాలన్న రూల్‌తో రాష్ట్రంలో పంట నష్టపోయిన విస్తీర్ణం ప్రాథమిక అంచనాలో సగానికే పరిమితమైంది. ఆయా జిల్లాల్లో ఫీల్డ్ సర్వే చేసిన తర్వాత కలెక్టర్లు సమర్పించిన రిపోర్టుల ప్రకారం కేవలం 1,51,645 ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు, 1,30,988 మంది రైతులు నష్టపోయినట్లు తేలింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన రూ.228 కోట్లలో కేవలం రూ.151 కోట్లు మాత్రమే ఆయా రైతులకు పరిహారంగా అందనున్నాయి. 33 శాతం పంట నష్టం జరగాలన్న రూల్ తో ఎక్కువ మంది అన్నదాతలకు అన్యాయం జరిగిందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 21 వేల ఎకరాలు మైనస్..
కరీంనగర్ జిల్లాలో 29,465 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తుది అంచనా వేసినట్లు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రకటించగా.. రాష్ట్ర అగ్రికల్చర్ ఆఫీస్‌కు వెళ్లేసరికి ఆ లెక్క 8,166 ఎకరాలకు చేరింది. ఏకంగా 21 వేల ఎకరాల విస్తీర్ణాన్ని లెక్కల్లోకి తీసుకోకుండా మైనస్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో 6,910 ఎకరాలు, జగిత్యాలలో 532 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 192 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు పంపగా.. ఈ లెక్కల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వరంగల్ జిల్లాలో అత్యధికంగా సుమారు 69 వేల ఎకరాల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ ఫైనల్ రిపోర్టులో ఆ లెక్కను 60,936 ఎకరాలకు పరిమితం చేశారు. ఖమ్మం జిల్లాలో 31 వేల ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా ఉండగా, ఫైనల్ రిపోర్ట్ ప్రకారం 18,258 మంది రైతులకు చెందిన 23,632 ఎకరాల్లోనే నష్టం జరిగిందని నివేదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వందల ఎకరాల్లో మిర్చి పంటను కల్లాల్లో ఆరబోయగా, వర్షాలకు తడిసింది. కానీ, ఆఫీసర్ల రూల్స్ ప్రకారం దీన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో కేవలం ఇతర పంటలు 1,435 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్టు రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో ఒక్క ఎకరా కూడా మిర్చి పంట లేకపోవడం గమనార్హం.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు చెందిన రైతు వట్టికొండ రామకృష్ణ ఈ ఏడాది 35 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇందులో రెండెకరాలు మాత్రమే సొంత భూమి కాగా, మిగిలిన 33 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. మార్చిలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట మొత్తం నేలకూలింది. పంట నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు 23వ తారీఖున సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు వచ్చిన టైంలో మొదట మాట్లాడింది రామకృష్ణతోనే. ముందుగానే కౌలు చెల్లించి, పంటకు పెట్టుబడి పెట్టి తాము నష్టపోయామని రామకృష్ణ చెప్పగా, తప్పకుండా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. కానీ, నెల రోజులు కావొస్తున్నా ఇంత వరకు రైతు రామకృష్ణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు.
పంట నష్టం ఇంకా అందలేదు
రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశా. ఒక్కొక్క ఎకరం రూ. 25వేల కౌలు కాగా, ఒక్కొక్క ఎకరానికి మొక్కజొన్న సాగు చేసి రూ.25వేలు పెట్టుబడి పెట్టా. తీరా పంట చేతికి వచ్చే టైంకు అకాల వర్షం, ఈదురు గాలులతో పంట మొత్తం నేలకొరిగింది. సీఎం కేసీఆర్ మా దగ్గరకు వచ్చి భరోసా కల్పిస్తూ ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం గంటలో అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు వారాలు దాటిపోయినా నేటికీ పంట నష్టపరిహారం అందలేదు.
- వేమాని నరసింహారావు,
నక్కల గరువు, మధిర మండలం
వెంటనే పరిహారం జమ చేయాలి
గతేడాది గండగలపాడులో రెండు ఎకరాలు మెట్ట పొలాన్ని కౌలుకు తీసుకొని మిరప తోట వేశాను. తామర పురుగు ఉధృతంగా వచ్చి రెండు ఎకరాల పంట నాశనమైంది. ఆ ఆప్పు తీరకముందే ఈ సంవత్సరం అదే భూమిలో మొక్కజొన్న వేశాను. పంట చేతికి వచ్చే క్రమంలో అకాల వర్షం వచ్చి రెండు ఎకరాల పంట పొలం మొత్తం నేలవారింది. అగ్రికల్చర్ ఆఫీసర్లు పంట నష్ట అంచనా వేసి వివరాలు తీసుకెళ్లారు. కానీ నేటికీ మా అకౌంట్లో పంట నష్టం పైసలు జమ కాలేదు. వెంటనే ప్రభుత్వం పంట నష్ట పరిహారం డబ్బులను
జమ చేయాలని కోరుతున్నాను.
- డి.నరసింహారావు, కౌలు రైతు, వైరా