సెప్టెంబర్‌లోపు పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. పరిహారం అందిన తర్వాతే... పోలవరంలో నీళ్లు నింపడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. వెయ్యి, రెండు వేల కోట్లు అయితే.. తాను ఆందోళన చెందే వాడిని కాదని.. రూ. 20 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాము కుస్తీ పడుతున్నట్లు.. ఎవరికీ నష్టం జరుగకుండా మంచి జరిగే విధంగా చూస్తామన్నారు. బుధవారం అల్లూరి సీతరామరాజు జిల్లాలోని చింతూరు మండలంలోని కోయగూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలవరం ఆర్ అండ్ ఆర్ నిధుల కోసం కేంద్రంతో పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అక్కడి నుంచి స్పందన రాకపోతే నీళ్లు నింపకుండా ఆపుతామన్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాతే నీళ్లు నింపడం జరుగుతుందని హామీనిచ్చారు. సెప్టెంబర్ లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం ఇవ్వడం జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేసిందని, అందరికీ రేషన్, ఒక్కో కుటుంబానికి రూ. 2 వేలు అందించడం జరిగిందన్నారు. అందరికీ సహాయం, అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
