పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో పెట్టాలి 

పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో పెట్టాలి 
  • కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కు లేఖ రాసిన కేటీఆర్

హైదరాబాద్: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కు లేఖ రాశారు. పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచో కోరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సీఎం కేసీఆర్ కూడా స్పందించి ప్రధాని మోడీకి లేఖ రాశారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలసి ప్రస్తావించగా.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హామీ కూడా ఇచ్చారు. 
కరోనా పరిస్థితుల క్రమంలో ఈ ఏడాది పరీక్షలు తప్పనిసరిగా ప్రాంతీయ భాషల్లో పెడతారని ఆశించిన వారికి షాక్ ఇస్తూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ ప్రకటించింది. నోటిఫికేషన్‌లో పరీక్షలు హిందీ, ఇంగ్లిషులోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎ్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లలోకానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టులతోపాటు అస్సామ్‌ రైఫిల్స్‌లో రైఫిల్‌ మ్యాన్‌ ఉద్యోగాల కోసం తాజాగా స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిటీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచే ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 31. దరఖాస్తుల గడువు ముగిశాఖ పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తామని కమిషన్‌ పేర్కొంది. 
ఈ నేపధ్యంలో గతంలో రాసిన లేఖను ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ తాజాగా మరో లేఖ రాశారు. పరీక్షలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఆయన కోరారు. ప్రతిసారి ఇలా హిందీ, ఇంగ్లీషులో పరీక్షలు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్న విషయం బహిరంగ రహస్యం. ముఖ్యంగా పదవ తరగతి అర్హత ఉన్న ఉద్యోగాలకు మన తెలుగు విద్యార్థులు కేవలం ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం లేక ఉద్యోగాలు దక్కించుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ స్థాయి అభ్యర్థులకు ఇంగ్లిషులో ప్రాణవీణ్యం ఎలా వస్తుంది? ఎందుకంటే పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇంగ్లిషులో కంప్యూటర్‌లో పరీక్ష రాసే స్థాయి ఎంత మంది అభ్యర్థులకు ఉంటుంది ? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ మళ్లీ గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తుండడం గ్రామీణ తెలుగు విద్యార్థుల్లో ఆశలు చిగురింప చేస్తోంది.