ఊరు వదిలి పెట్టాలని..సర్పంచ్ భర్త బెదిరిస్తుండు

ఊరు వదిలి పెట్టాలని..సర్పంచ్ భర్త బెదిరిస్తుండు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వేముల కుర్తి సర్పంచ్ నవ్యశ్రీ భర్త సత్యం.. తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని 60 కుటుంబాలకు చెందిన ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 40 ఏళ్లుగా ఇదే గ్రామంలో నివసం ఉంటున్న తమను ఊరు వదిలివెళ్లిపోవాలంటూ సర్పంచ్ భర్త బెదిరిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్ ఆదేశాలతో.. తహశీల్దార్, ఎంపీడీవో వేములకుర్తి గ్రామంలో విచారణ చేపట్టారు. 

ఆదిలాబాద్ జిల్లా బోథ్, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 40 ఏళ్ల క్రితమే 60 కుటుంబాల ప్రజలు వేములకుర్తి గ్రామానికి వలసవచ్చారు. గ్రామంలో భూములు కొనుగోలు చేసుకుని, వివిధ రకాల వృత్తులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా తమను సర్పంచ్ భర్త వేధిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఆస్తులు అమ్ముకొని ఊరు విడిచి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నాడని తహశీల్దార్ ముందు వాపోయారు. తమ దగ్గర నుంచి ఆధార్ కార్డులు బలవంతంగా తీసుకొని వాటిని డిలీట్ చేపిస్తున్నాడని ఫిర్యాదు చేశారు.

తమ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయనీయకుండా, పెళ్లి సంబంధాలు కుదిరితే పెళ్లి చేసుకోనివ్వకుండా సర్పంచ్ భర్త అడ్డుపడుతున్నాడని బాధితులు చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా రజక, ఆదివాసి, బీసీ కులాలకు చెందినవారే ఉన్నారు. అయితే.. సర్పంచ్ భర్త సత్యం వేధింపులు భరించలేక అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారమని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గ్రామానికి బయట నుంచి వచ్చిన వారి వివరాలు తెలుసుకోవడానికే ఆధార్ కార్డులు చెక్ చేస్తున్నామని సర్పంచ్ నవ్యశ్రీ వివరణ ఇచ్చారు. తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. దీనిపై ఎంపీడీవో, తహశీల్దార్ విచారణ జరుపుతున్నారు. తప్పు ఎవరు చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.