టీఆర్ఎస్ నేతపై పంజాగుట్ట పీఎస్​లో కంప్లయింట్

టీఆర్ఎస్ నేతపై పంజాగుట్ట పీఎస్​లో కంప్లయింట్

ఖైరతాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్  తనపై దాడి చేశాడంటూ ఓ మహిళ పంజాగుట్ట పీఎస్​లో కంప్లయింట్ చేసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేటలోని బీఎస్ మక్తాలో ఉండే  ఓ మహిళ బల్దియాలో కాంట్రాక్ట్ వర్కర్​గా పనిచేస్తోంది.  ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఆమెకు ఫేస్ బుక్ ఫ్రెండ్ అయినా టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ విజయసింహ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది.

న్యూడ్ వీడియో కాల్ చేయాలని విజయ సింహా అడగడంతో ఆమె ఒప్పుకోలేదు. అతడి నంబర్​ను బ్లాక్ చేసింది. కొద్దిసేపటి తర్వాత విజయ సింహా ఆమె ఇంటికి వచ్చాడు.  బీర్ బాటిల్​ను పగులగొట్టి ఆ ముక్కతో గొంతు, ఎడమ చేతిపై దాడి చేశాడు. సదరు మహిళ అరవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత మహిళ డయల్ 100కు కాల్ చేయగా.. పోలీస్ సిబ్బంది ఆమెను  సోమాజిగూడ యశోద హాస్పిటల్​కు  తరలించారు. అక్కడ పోలీసులు బాధితురాలి స్టేట్​మెంట్ తీసుకుని కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

తప్పుడు ప్రచారం చేస్తున్నరు: విజయ్ సింహా

మహిళపై దాడి ఘటన సోమవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్​గా మారడంతో విజయ సింహా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  తాను గతంలో బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసిదుద్దిన్  దగ్గర పీఏగా పనిచేశానని, ఆయన అక్రమాలు, అవినీతిని చూసి బయటికి వచ్చాను అని పేర్కొన్నాడు. ఆ క్రమంలో బోరబండ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని తెలిపారు. బోరబండ డివిజన్ లో తనను బద్నాం చేయడానికే కావాలనే బాబా ఫసియుద్దీన్ సదరు మహిళతో ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపించాడు. ఆదివారం రాత్రి ఘటన జరిగిన సమయంలో తాను కూకట్ పల్లిలో ఉన్నానని.. అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు.  

పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకుల ఆందోళన

మరోవైపు మహిళపై దాడి ఘటన గురించి తెలుసుకున్న మహిళా కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ వరలక్ష్మి ఆధ్వర్యంలో నేతలు పంజాగుట్ట పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. బీజేపీ ఖైరతాబాద్ సెగ్మెంట్ కో ఆర్డినేటర్ పల్లపు గోవర్ధన్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సైతం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. గోవర్ధన్ మాట్లాడుతూ.. మహిళపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఘటనపై విచారణ జరిపి విజయ సింహాపై చర్యలు తీసుకోవాలన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, సిటీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు పాల్గొన్నారు.