డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని ఆందోళన

డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని ఆందోళన

శాంతినగర్, వెలుగు: కడుపునొప్పి వస్తుందని ట్రీట్మెంట్  కోసం వస్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీశారని ఆరోపిస్తూ బంధువులు హాస్పిటల్  ముందు ఆందోళన చేశారు. మృతురాలి బంధువుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లి మండలం శాంతినగర్ కు చెందిన షేక్  నజియా(26) కడుపు నొప్పి రావడంతో ఆదివారం శాంతినగర్ లోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. చికిత్స చేసి నయమవుతుందని డాక్టర్లు తెలిపారు.

 సాయంత్రం వరకు షేక్ నజియా బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. రాత్రి 8 గంటలకు సీరియస్ గా ఉందని, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి డాక్టర్​ వెళ్లిపోయారు. అంబులెన్స్ లో కర్నూల్​కు తీసుకెళ్లగా, నజియా చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని హిజరత్ బాషా ఆరోపించారు. హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు రాలేదని శాంతినగర్  ఎస్ఐ నరేశ్​ తెలిపారు.