రోడ్డెక్కిన డబుల్ బెడ్ రూం లబ్దిదారులు

రోడ్డెక్కిన డబుల్ బెడ్ రూం లబ్దిదారులు

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్​ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది. జాబితాలో తమ పేరు లేదంటూ గజ్వేల్‭లో బాధితులు రోడ్డెక్కారు. అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. గజ్వేల్​ మున్సిపాలిటీ పరిధిలో 1200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిన ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక కోసం అభ్యంతరాలను తెలియజేయడానికి శుక్రవారం జాబితా విడుదల చేసింది. అయితే లిస్టులో పేరులేని వారు తమకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు. జాబితాలో చాలామంది అనర్హులు ఉన్నారని.. అర్హులైన తమ పేర్లు లిస్టులో రాలేదని వందల సంఖ్యలో లబ్ధిదారులు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయం ముందుకు వెళ్లి అక్కడ నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. గజ్వేల్ లో మొత్తం 1200 ఇండ్ల కోసం 3500 మంది దరఖాస్తు చేసుకున్నారు.