కుల్కచర్ల గిరిజన గురుకులాన్ని సందర్శించిన నేతలు

కుల్కచర్ల గిరిజన గురుకులాన్ని సందర్శించిన నేతలు

రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుడడంతో విద్యార్థులు, ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. నాణ్యమైన భోజనం అందివ్వకపోవడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా... గిరిజన విద్యార్థులపై వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వివక్ష చూపుతున్నారని గిరిజన సంఘం నాయకుడు గోపాల్, కాంగ్రెస్ నాయకుడు ఆంజనేయులు ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

దీంతో గిరిజన సంఘం నేతలు, అఖిలపక్ష నాయకులు పాఠశాలను సందర్శించారు. ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో సమస్యలు విలయతాండవం చేస్తుంటే ఎలాంటి సమస్యలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వివిధ మాధ్యమాల్లో వచ్చిన వార్తల ద్వారా గురుకులంలో సమస్యలపై ఆరా తీసేందుకు వెళ్తే పోలీసులతో అరెస్టు చేయడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ చెబితే గాని ఎమ్మెల్యేకు ఏమి తెలియదని విమర్శించారు. గురుకులంలో సమస్యలను వెలికితీసిన మీడియాను ఎమ్మెల్యే నిందించడం తగదని, వెంటనే ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.