టెన్షన్ టెన్షన్.. అభ్యర్థుల్లో న్యూట్రల్‌‌‌‌ ఓట్ల ఆందోళన

టెన్షన్ టెన్షన్.. అభ్యర్థుల్లో న్యూట్రల్‌‌‌‌ ఓట్ల ఆందోళన

ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటరూ ముఖ్యమే. ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు ఎందరో ఉన్నారు. వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్స్​ అయిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటూ చేజారకూడదని ఆశిస్తారు. కానీ, అది అంత తేలికైన విషయం కాదు.. ఓట్ల చీలికను అడ్డుకోవటం అసాధ్యం. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​పై అన్ని పార్టీలూ టెన్షన్ కు గురవుతున్నాయి.   

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ప్రధాన పార్టీలకు ఓ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంటుంది. వీళ్లు, అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గుర్తును చూసి ఓటేస్తారు. పార్టీ కోసం చమటోడ్చే కార్యకర్తల నుంచి, సానుభూతిపరుల వరకు ఈ కేటగిరీలోకి వస్తారు. ఈ ఓట్లకు ఎప్పుడూ డోకా ఉండదు. ఎటొచ్చీ సమయం, సందర్భాన్ని అనుసరించి.. అప్పటి సమస్యలు, ప్రస్తుత అభ్యర్థుల ఇమేజ్ ఆధారంగా ఓటెవరికి వేయాలో డిసైడ్ చేసుకునే ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. వీళ్లే గెలుపోటముల్ని డిసైడ్ చేయటంలో కీలకం. వీళ్లను ప్రసన్నం చేసుకోవటానికి పార్టీలన్నీ ఇన్నాళ్లు నానా తంటాలు పడ్డాయి.  

ఓట్లు చీల్చే వారితోనే సమస్య

రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాల్లో వేల మంది ఇండిపెండెంట్లు,  ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో కొందరు తాము గెలవకపోయినా, తమ బలాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. వీరు వందల నుంచి వేల వరకు ఓట్లను చీలుస్తారు. వీరితో ఎవరికి ప్రమాదం, ఎవరికి ప్రమోదం అనే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లోనే ఉంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు, మరికొన్ని చోట్ల సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలు.. ఇంకా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు. మొత్తంగా ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ అభ్యర్థులు చీల్చే ఓట్ల ప్రభావం ఎవరిపై ఉంటుందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది.

బర్రెలక్క ఎఫెక్ట్‌‌‌‌ తో మారిన సీన్‌‌‌‌..

రాష్ట్రంలో  బర్రెలక్క ఓ సంచలనంగా మారింది. ఆమె వాయిస్ వ్యక్తిగతం కాక పోవడంతో ఆమెను అనుసరిస్తున్న లక్షలమంది ఆకాంక్షలకు ప్రతీక అనే గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా హల్చల్ ని దాటి ఎన్నికల గోదాలోకి బర్రెలక్క వస్తుందని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా కొల్లాపూర్‌‌‌‌ నియోజక వర్గంలో ఎంట్రీ ఇచ్చిన  ఆమెపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. శిరీష తాను గెలుస్తాననే నమ్మకంలో ఉంది.. తొలుత లైట్ తీసుకున్న ప్రధాన అభ్యర్థులు కూడా ఇప్పుడామెను చూసి భయపడుతున్నారు. నామినేషన్లకు ముందు వరకు ఇది కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ల మధ్య పోరుగా భావించారు. కానీ, బర్రెలక్క ఎంట్రీతో ఇక్కడి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది.

అభ్యర్థులకు కోవర్టుల టెన్షన్..

చాలా చోట్ల అభ్యర్థులకు కోవర్టుల టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో.. ప్రతిపక్ష పార్టీ నేతలు వేసే ఎత్తుగడలను ముందే పసిగట్టడం అంతే ముఖ్యంగా భావిస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు తమ అనుచరులను పక్క పార్టీకి పంపి కోవర్టు అస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో తమ ప్లాన్‌‌‌‌ ప్రత్యర్థులకు చేరకుండా  చూసుకోవడం కత్తిమీద సాములా మారింది.ఈ నేపథ్యంలో నేతలకు, పార్టీలో మనస్ఫూర్తిగా పనిచేస్తున్న వారు ఎవరో, కట్టప్పలు ఎవరో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఫిరాయింపు నేతలతోపాటు సొంతపార్టీల్లోనే అసమ్మతి నేతలను సైతం అనుమానిస్తూ, ఎవరిని నమ్మాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. 

పార్టీ నేతలు, కీలక నేతలను కేవలం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలకే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్లకు పంచే నగదు తమ అనుచరులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు.  అయినా, ఒక్కోసారి ఎంత జాగ్రత్త పడినా రాత్రి అనుకున్న విషయాలు తెల్లారేలోగా పక్క పార్టీలకు చేరుతున్నాయి. ఇలా లీకేజీలకు పాల్పడుతున్న కోవర్టులు అన్ని పార్టీలకు దడపుట్టిస్తూ తలనొప్పిగా మారుతున్నారు.