సహారా డిపాజిటర్ల ఆందోళన

సహారా డిపాజిటర్ల ఆందోళన
  •     తమ సొమ్ము తిరిగి చెల్లించాలని డిమాండ్ 
  •     ఏజెంట్ ఇంటి ఎదుట ధర్నా 
  •     స్థానిక పీఎస్​లో ఫిర్యాదు
  •     బాధితులకు నచ్చజెప్పి పంపించిన పోలీసులు 

కోనరావుపేట, వెలుగు:  సహారా ఇండియా పరివార్ లో తాము డిపాజిట్ చేసిన సుమారు రూ.2 కోట్ల సొమ్మును తిరిగి చెల్లించాలంటూ ఏజెంట్ ఇంటి ముందు బాధితులు మంగళవారం ఆందోళన చేశారు. తర్వాత సదరు ఏజెంట్​ను పోలీస్​స్టేషన్​కు పట్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగళపల్లికి చెందిన సిరిసిల్ల ప్రవీణ్ సహారా ఏజెంట్​గా కోనరావుపేటతో పాటు శివంగళపల్లి, ఎగ్లాస్​పూర్​, ఇతర  గ్రామాల్లో జనాల నుంచి డిపాజిట్లు తీసుకున్నాడు. 

అయితే, గడువు ముగిసినా డిపాజిటర్ల డబ్బులు తిరిగివ్వడం లేదు. దీంతో శివంగళపల్లికి చెందిన బాధితులు మంగళవారం ఏజెంట్​ప్రవీణ్​ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. అందరి డబ్బులను ‘సహారా’లో డిపాజిట్ ​చేశానని, కంపెనీ ఆస్తులను జప్తు చేసి డిపాజిటర్ల డబ్బులను ఇవ్వమని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిందని, త్వరలోనే డబ్బులు వస్తాయని వారికి చెప్పాడు. అయితే, ఎప్పటి నుంచో ఇదే మాట చెప్తున్నాడని, డబ్బులు కావాల్సిందేనంటూ ప్రవీణ్​ను పట్టుకొని కోనరావుపేట పోలీస్​స్టేషన్​కు తీసుకువెళ్లారు. 

విషయం తెలుసుకున్న కోనరావుపేట, ఎగ్లాస్​పూర్ లకు చెందిన డిపాజిటర్లు కూడా పీఎస్​కు చేరుకుని ఆందోళన చేశారు. తమ సొమ్మును తిరిగిప్పించాలని, ఏజెంట్ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి ఫిర్యాదు చేశారు. సహారా కేసు వివాదం దేశమంతటా ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని బాధితులకు నచ్చజెప్పి పంపించారు.