- ...కాంట్రాక్టర్, సింగరేణి పట్టించుకుంటలేదు
- 20 రోజులుగా విధులు లేక ఇబ్బందుల్లో ఉన్నాం
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి కేకే ఓసీపీలో పనులు లేక 20 రోజులుగా అవస్థలు పడుతున్నామని కాంట్రాక్ట్డ్రైవర్లు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మందమర్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేకే ఓసీపీలోని ఆర్వీఆర్ ఓబీ కాంట్రాక్టర్ వద్ద కాంట్రాక్ట్డ్రైవర్లు, హెల్పర్లుగా 480 మంది పనిచేశామని ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు ఇంకా ఇవ్వలేదని, అక్టోబర్లో దసరా పండుగ బోనస్ చెల్లించలేదని వాపోయారు.
సెప్టెంబర్30తో ఓబీ కాంట్రాక్ట్ పూర్తయిందని, తమ వేతనాలు, బోనస్ సెటిల్మెంట్ చేస్తానని కాంట్రాక్టర్ హామీ ఇచ్చి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మరో ఏడాది కాంట్రాక్ట్ దక్కించుకున్నప్పటికీ సదరు ఆర్వీఆర్ కంపెనీ పనులు చేయకపోవడంతో తాము 20 రోజులుగా డ్యూటీలు లేక ఖాళీగా ఉంటున్నామని అన్నారు. తమ డ్రైవింగ్లైసెన్సులు కాంట్రాక్టర్ వద్ద ఉండటంతో ఇతర చోట్ల పనికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం దృష్టికి తీసుకవెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు తమకు అండగా నిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో కాంట్రాక్ట్ డ్రైవర్లు ఎండి నజరుద్దీన్, ఏ సతీష్ , రాగిడి రామ్ రెడ్డి, రమేష్, రాజేందర్, శ్రీధర్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.