అవే పెంకుటిండ్లు ఇరుకు సందులు .. బంగారు వాసాలమర్రి ఓ ఫెయిల్యూర్ స్టోరీ 

అవే పెంకుటిండ్లు ఇరుకు సందులు .. బంగారు వాసాలమర్రి ఓ ఫెయిల్యూర్ స్టోరీ 
  • మూడేండ్ల కింద మాజీ ముఖ్యమంత్రి దత్తత
  • అరచేతిలో స్వర్గం చూపిన కేసీఆర్​
  • చివరికి ‘శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలే’ మిగిల్చిండు
  • ఊరివారికి పాడి గేదెలు రాలే, ట్రాక్టర్లు ఇయ్యలే.. ఆశలపై నీళ్లు 

యాదాద్రి, వెలుగు:  మాజీ సీఎం కేసీఆర్​ దత్తత తీసుకున్న వాసాలమర్రి పరిస్థితి.. భారీ అంచనాలతో రిలీజైన సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినట్లయ్యింది. దత్తత పేరుతో మూడేండ్లుగా సర్వేల మీద సర్వేలు చేస్తూ, ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా హైప్​ క్రియేట్ చేసినా.. చివరికి కేసీఆర్​చెప్పినట్లు ‘శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు’ మాత్రమే మిగిలాయి. పలుమార్లు పర్యటించిన కేసీఆర్.. ఓసారి ఊరంతటికీ దావతిచ్చి రూ.150 కోట్ల విలువైన హామీలతో గ్రామస్థులను ఊహల పల్లకిలో ఊరేగించారు. ఈ ఊరిని ఆయన దత్తత తీసుకొని మూడేండ్లు గడిచినా గ్రామ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈలోగా బీఆర్ఎస్​ సర్కారు పోయి కాంగ్రెస్  అధికారంలోకి​ వచ్చింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో తెలియక వాసాలమర్రి గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఇంతన్నరు.. అంతన్నరు

యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని 2020 నవంబర్​1న  అప్పటి సీఎం కేసీఆర్​ దత్తత తీసుకున్నారు. రూ.150 కోట్లకు పైగా ఖర్చుచేసి గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని ఆయన ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాసాలమర్రిపై చెప్పలేనంత హైప్​​ క్రియేట్​అయింది. దత్తత తీసుకున్న 10 నెలల దాకా వాసాలమర్రి ఊసెత్తని కేసీఆర్..​ ఆ తర్వాత ఉన్నట్టుండి పాత ఇండ్లు కూల్చేసి అందరికీ కొత్తగా ఇండ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు.

ఊరిలోని యువతకు ఉపాధి కల్పిస్తామని, ప్రతి ఇంటికి పాడి గేదె, అవసరమైన వారికి ట్రాక్టర్లు అందజేస్తామని ఊరించారు. ప్రభుత్వం నుంచి సాయం పొందని ఇల్లు, మనిషే ఉండకూడదంటూ కేసీఆర్​ చెప్పుకొచ్చారు. ఊరి అభివృద్ధి కోసం రూ.150 కోట్లతో ఒకసారి, రూ. 165 కోట్లతో మరోసారి డీపీఆర్​ రూపొందించి ఉన్నతాధికారులకు పంపినా వాటిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. చింతమడక నుంచి ఆర్కిటెక్స్​ వచ్చి పలుమార్లు సర్వేల మీద సర్వేలు చేసి ప్లాన్​ రూపొందించడమే కాకుండా మార్కింగ్​ చేశారు. ఆ తర్వాత కొత్తగా ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వవద్దని ఆఫీసర్లకు ఇంటర్నల్​ ఆర్డర్స్​ జారీ చేశారు.

చెప్పింది ఎక్కువ.. ఇచ్చింది తక్కువ..

కేసీఆర్​ వంద, నూటయాభై కోట్ల ముచ్చట చెబితే స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్​ కింద  రూ. 58.57 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్​ 18న జీఓ 159 జారీ చేశారు. అందరికీ కండ్లు చెదిరే బంగ్లాలు కట్టిస్తారని ఊహిస్తే రూ.5 లక్షల చొప్పున రూ.24.24 కోట్లతో మొత్తం 481 డబుల్​బెడ్​రూ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో వాసాలమర్రి గ్రామస్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

సర్కారు కట్టే ఇండ్ల కంటే తాము ఉంటున్న ఇండ్లే బెటర్​ అనే ఆలోచనకు వచ్చి, పాత ఇండ్లు కూల్చేందుకు చాలా మంది ముందుకు రాలేదు. ఇక ప్రైమరీ, హైస్కూల్​ బిల్డింగ్స్​ నిర్మాణం కోసం రూ.3.23 కోట్లు, పంచాయతీ బిల్డింగ్​ కోసం రూ.20 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. రూ.75 లక్షలతో మూడు అంగన్​వాడీ కేంద్రాలు, రూ.25 లక్షలతో హెల్త్​ సబ్​ సెంటర్​ ప్లాన్​ చేశారు. రోడ్లు, పార్కులు, ఫంక్షన్​ హాల్​ సహా మౌలిక వసతుల కోసం రూ.30.14 కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు.  

ఏ ఒక్క హామీ అమలుకాలే

కేసీఆర్​ దత్తత తీసుకొని ఈ ఏడాది నవంబర్​1కి మూడేండ్లు గడిచాయి. కానీ, ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. దీంతో వాసాలమర్రి వాసుల ఆశలు తల్లకిందులయ్యాయి. యాదాద్రి నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్​ ఫాంహౌజ్​కు వెళ్లడానికి ఉపయోగపడుతుందని రోడ్డు వేశారు. అది కూడా పూర్తికాలేదు. గ్రామంలో బీడీ కార్మికులకు పింఛన్లు, కొందరికి రేషన్​కార్డులు ఇచ్చారు. అంగన్​వాడీ సెంటర్లు, హెల్త్​ సెంటర్​ సహా ప్రైమరీ, హైస్కూల్​ టెండర్లు ఖరారై నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్​లో గ్రామానికి వచ్చిన అప్పటి కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి.. పునర్నిర్మాణం కోసం టెండర్లు వేస్తామని ప్రకటించారు. టెండర్లు రాలేదు. ఏ పనీ స్టార్ట్​ కాలేదు. దీంతో వాసాలమర్రిలో ఎలాంటి మార్పు రాలేదు. అవే ఇరుకు రోడ్లు, అవే పెంకుటిండ్లు, ఎత్తు ఒంపుల తొవ్వలే కనిపిస్తున్నాయి. 

మా మంచికే : గ్రామస్థులు

టెండర్లు వేయకపోవడం తమ మంచికే జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. టెండర్లు వేసి ఇండ్లు కూలగొట్టి ఉంటే తమ పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఇండ్లు పూర్తయ్యే నాటికి టెంట్ల కింద  గోసపడాల్సి వచ్చేదన్నారు. కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ ఇండ్ల కింద రూ.5 లక్షలు ఇస్తామంటున్నారని, అదే జరిగితే ఎవరి జాగలో వాళ్లు ఇండ్లు కట్టుకుంటామని చెప్తున్నారు.

వాసాలమర్రిలో బీఆర్​ఎస్​కు సగం మంది ఓటెయ్యలే

కేసీఆర్​ నమ్మించి మోసం చేయడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను అక్కడి ఓటర్లు ఆదరించలేదు. నవంబర్​ 30న జరిగిన పోలింగ్​లో గ్రామంలో1376 ఓట్లకుగాను 1258 ఓట్లు పోలయ్యాయి. వాటిలో బీఆర్ఎస్​ అభ్యర్థి గొంగిడి సునీతకు 525 మంది (41.73 శాతం) ఓట్లేయగా, కాంగ్రెస్​ అభ్యర్థి బీర్ల అయిలయ్యకు 448 మంది (35.61 శాతం), బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్​కు 219 (17.40 శాతం) మంది  ఓటేశారు.